గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వాసుదేవన్
Last Modified: బుధవారం, 13 మే 2020 (18:14 IST)

కేసీఆర్‌పై రాములమ్మ ఆగ్రహం, ఏమిటి సంగతి?

వ్రతం చెడ్డా ఫలం దక్కాలని ఒక పాత సామెత ఉంది. అయితే అలా జరగలేదనే ఇప్పుడు రాములమ్మ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడుతోంది. వివరాలలోకి వెళ్తే... ఒకప్పుడు తెరాసలో ఒక వెలుగు వెలిగి... తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీకి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న విజయశాంతి తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతా వేదికగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. 
 
ఈ మేరకు ఆమె తన పేజీలో... "జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్ పాటించారు కదా? పాజిటివ్‌ల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి. సరైన సంఖ్యలో పరీక్షలు ఇప్పటివరకూ చేయకుంటే ఆ నిజం ఒప్పుకోండి. 
 
అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. వైన్ షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా? ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది", అంటూ మండిపడ్డారు. మరి... కేసీఆర్ ఏం సమాధానం ఇవ్వనున్నారో.. వేచి చూద్దాం.