ఆసియాలోనే హైదరాబాద్ నగరాన్ని నెం.1 చేస్తాం: మంత్రి తారక రామారావు
రానున్న పది సంవత్సరాల్లో హైదరాబాద్ ను ఏషియా లోనే అగ్రగామి లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రయత్నం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. రానున్న పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ కి భారీ పెట్టుబడులను ఈ రంగంలో ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై న రూపొందించిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్- 2030 నివేదికను ఈరోజు మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ సలహా కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశం లో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు, ఫార్మా నిపుణులు, విద్యా సంస్థల అధిపతులు పలువురు ఈ సమావేశానికి హాజరై తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన పరిస్థితులతో పాటు భవిష్యత్తులో ఈ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల పైన విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా వీరంతా రానున్న పది సంవత్సరాల్లో ఏ చర్యలు తీసుకుంటే బాగ ఉంటుంది, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడుల ఆకర్షణ మరియు ఉద్యోగాల కల్పన దిశగా ఏ ముందుకు వెళ్లాలి అన్న విషయంతో పాటు ప్రభుత్వం నుంచి పరిశ్రమ ఆశిస్తున్న చర్యల పైన మంత్రి కేటీఆర్ కు వివరించారు. వీటన్నిటి పైన సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ భవిష్యత్తులోనూ ఫార్మా రంగం పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధిలో ప్రభుత్వ ప్రాధాన్యతా రంగంగా కొనసాగుతుందని తెలియజేశారు.
లైఫ్ సైన్సెస్ రంగంలోని భాగస్వాములతో పాటు, పెట్టుబడిదారులు, అకాడెమియా(విద్యారంగ నిపుణులు), సలహాదారులు, ప్రభుత్వ అధికారులు మరియు ఇతర అనుబంధ సంస్థల తో విస్తృతంగా చర్చించి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. ఇది నివేదిక ప్రభుత్వానికి పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.
రానున్న పది సంవత్సరాల్లో తెలంగాణను ఏషియా తో పాటు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన లైఫ్ సైన్సెస్ పెట్టుబడి గమ్యస్థానంగా మలిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కోసం కలిసివచ్చిన లైఫ్ సైన్సెస్ భాగ స్వాములు అందరికీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రూపొందించిన నివేదికను పరిశ్రమ అభిప్రాయాలను లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ మరియు డాక్టర్ రెడ్డీస్ సంస్థ అధిపతి అయిన సతీష్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన లైఫ్ సైన్స్ రంగంలో ప్రభుత్వం తో కలిసి పరిశ్రమ పనిచేస్తుందని ప్రభుత్వ ఆలోచనల మేరకు ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు పని చేస్తామని అన్నారు.
పదేళ్లలో ఆసియా ఖండంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారెందుకు హైదరాబాద్ కి అన్ని అనుకూలతలు ఉన్నాయని, ముఖ్యంగా ఇక్కడ దొరికే నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యాలు, నాణ్యమైన మౌలిక వసతులు అంతకు మిక్కిలి తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు అత్యంత ఆసక్తి చూపించే ప్రభుత్వ నాయకత్వం ఇక్కడ ఉండటం వలన ఇది సాధ్యమవుతుందని సతీష్ రెడ్డి తెలిపారు.