మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:10 IST)

వరంగల్ ఎంజిఎంను హైదరాబాద్ గాంధీలా చేస్తాం: ఈటెల రాజేందర్

కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ లోని గాంధి తరహాలో వరంగల్ ఎంజిఎంను తీర్చిదిద్దుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఎంజిఎం సందర్భించిన అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఎక్కడికక్కడే ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
 
వరంగల్ ఎంజిఎంలో ప్రస్తుతం కరోనా సోకిన వారి కోసం ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 340 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్యను 750కు పెంచుతామని ఈటల ప్రకటించారు. అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వరంగల్ నగరానికి ప్రత్యేకంగా మొబైల్ ల్యాబ్స్ పంపించనున్నట్లు ఈటల ప్రకటించారు.
 
వరంగల్ నగరంలో రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. వరద నీటి ప్రవాహ నాలాలు, మురికి నీటి నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీని మంత్రి నియమించారు.
 
భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జరిగిన నష్టంపై అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.