1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (17:18 IST)

కేసీఆర్ నాకు భయపడి ఖమ్మంలో సభ పెట్టాడు : వైఎస్ షర్మిల

yssharmila
తెలంగాణ వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఓటమి భయంతోనే ఖమ్మంలో కేసీఆర్ సభ పెట్టిండు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్ చేసిందేంటి? భద్రాచలానికి రూ.వంద కోట్లు అని రూపాయి ఇవ్వలేదు. గోదావరికి కరకట్ట కట్టలేదు. పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టు నిర్మించలేదు. కేసీఆర్ ఆయన పార్టీని ఖమ్మం జిల్లా ప్రజలు తరిమితరిమి కొడుతరు అంటూ జోస్యం చెప్పారు. 
 
పైగా, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అయ్యాక మొదటి సభ ఖమ్మంలోనే ఎందుకు పెట్టాడు. నేను పాలేరు నుండి పోటీ చేస్తున్నానని తెలిసి కేసీఆర్ నాకు భయపడి ఖమ్మంలో సభ పెట్టాడు. ఈ నెల 28 నుండి తిరిగి పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తా అని షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకొని కేసీఆర్ పెద్ద పొరపాటు చేశాడు. పాదయాత్ర ఎక్కడ అడ్డుకున్నారో అక్కడి నుంచే ఈ నెల 28వ తేదీన వైయస్ఆర్ బిడ్డ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో అడుగుపెట్టబోతుంది. ఈ పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అని అన్నారు. 
 
ప్రజాప్రస్థానంపై కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజాహితమే ధ్యేయంగా 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశాం. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేక పాదయాత్రపై కేసీఆర్ దాడి చేయించి, అడ్డుకున్నాడు. ఇక, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 28 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తాం. ఆగిన చోటు నుంచే పాదయాత్ర ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.