తమిళ భామపై మనసుపడిన 'పవర్ స్టార్'?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఒకవైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు తన సినీ కెరీర్‌కు ఎలాంటి నష్టం జరుగకుండా చూసుకుంటున్నారు. ఇందులోభాగంగా, ఆయన వరుస చిత్రాల్లో నటించేందుకు జైకొడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం "పింక్" రీమేక్ 'వకీల్ సాబ్'లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా పూర్తికాకముందే మరో మూడు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేశారు.
ఇందులోభాగంగా, మలయాళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన "అయ్యప్పనుమ్ కోషియమ్" అనే చిత్రాన్ని పవన్ హీరోగా తెలుగులోకి రీమేక్ కానుంది. ఇందులో పవన్ సరసన తమిళ భామ ఐశ్వర్యా రాజేష్‌ను ఎంపిక చేయనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఆ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉందట. ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. నిజానికి ఈ పాత్రకు తొలుత సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. కానీ, ఇపుడు ఐశ్వర్య పేరు తెర మీదకు వచ్చింది. ఈ ఆఫర్ ఐశ్వర్యకు వస్తే తెలుగులో ఆమెకు మరిన్ని మంచి రోల్స్ వచ్చే ఛాన్సుంది.
ఇదిలావుంటే, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్" చిత్రంలో కూడా ఐశ్వర్య ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించనుందే వార్తలు ఇటీవల వచ్చాయి. అయితే, దీనిపై ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.