గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (16:04 IST)

'గబ్బర్ సింగ్' కాంబోలో మూవీ.. టైటిల్ ఖరారు - మాస్ ఆడియన్సే టార్గెట్!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత రికార్డులను తిరగరాసిన చిత్రం గబ్బర్ సింగ్. ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన చిత్రం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగాను, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. పవన్ వీరాభిమానుల్లో ఒకరైన డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చారు.
 
అయితే, ఈ గబ్బర్ సింగ్ కాంబో మళ్లీ రిపీట్ కానుంది. కాకపోతే చిత్ర నిర్మాత మాత్రమే మారుతున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవీశ్రీ ప్రసాద్‌లు ఈ ప్రాజెక్టుకు వర్క్ చేస్తున్నారు. ఈ చిత్ర కథను ఇప్పటికే సిద్ధంచేసిన డైరెక్టర్.. మాస్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 
 
అందుకే ఈ చిత్రానికి "ఇపుడే మొదలైంది" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అంటే.. అసలైన ఆట ఇపుడు మొదలైంది అనే అర్థం వచ్చే రీతిలో ఈ చిత్ర టైటిల్‌ను ఖరారు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో పవన్ సరసన మలయాళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
క్రిష్ దర్శకత్వంలో చేయనున్న సినిమా పూర్తయిన తర్వాత, హరీశ్ శంకర్‌తో కలిసి పవన్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు. మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకునే హరీశ్ శంకర్ కథను సిద్ధం చేయగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలో  వెల్లడించనున్నారు. 
 
ఇదిలావుంటే హీరోయిన్‌గా మానస రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినట్టు వచ్చిన వార్తలపై హరీష్ శంకర్ స్పందించారు. మలయాళ భామలు తెలుగు తెరపై తమ జోరు చూపుతున్న కారణంగా అంతా ఈ వార్త నిజమేనని అనుకున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. 
 
ఇందులో ఎంతమాత్రం నిజం లేదనీ, ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని చెప్పాడు. తన సినిమాలకి సంబంధించిన వివరాలను తానే స్వయంగా తెలియజేస్తానని అన్నాడు. ఈ పుకారు ఎక్కడ పురుడు పోసుకుందో తెలియదుగానీ, హరీశ్ శంకర్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇప్పుడు పవన్ సరసన కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది.