రామ్ సరికొత్త ప్రయత్నం ఫలిస్తుందా..?
ఎనర్జిటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత చేసిన సినిమా రెడ్. ఈ చిత్రానికి నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అంతా రెడీ.. ప్రమోషన్ స్టార్ట్ చేసారు. ఇక సమ్మర్లో రిలీజ్ అనగా కరోనా రావడంతో బ్రేక్ పడింది.
ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థలు రెడ్ మూవీని రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం.. భారీ ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది కానీ.. రామ్ మాత్రం రెడ్ మూవీని థియేటర్లోనే రిలీజ్ చేస్తానని ప్రకటించారు. థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా చూసే మూడ్లో లేరు జనాలు. అయినప్పటికీ థియేటర్లోనే రెడ్ మూవీని రిలీజ్ చేయనున్నారు.
అయితే... ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అయితే... రామ్ తెలుగుతో పాటు మలయాళంలో కూడా తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. మామూలుగా వేరే భాషలంటే హీరోలకు డబ్బింగ్ వేరొకరు చెబుతుంటారు కానీ... రామ్ ఈసారి ఒరిజినాలిటీ కోసం తానే మలయాళంలో డబ్బింగ్ చెబుతారట. ఒక రకంగా ఇది అభినందించదగిన ప్రయత్నమే.ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా రిలీజ్ చేస్తుండడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. మరి... రామ్ సరికొత్త ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.