సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శుక్రవారం, 11 డిశెంబరు 2020 (18:09 IST)

హైదరాబాద్‌లో ప్రారంభమైన అమితాబ్‌ బచ్చన్‌-అజయ్‌ దేవగణ్‌ కాంబినేషన్‌లోని ‘మే డే’

బిగ్‌ బి అమితాబ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమా ‘మే డే’. దీనికి ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ దర్శకుడు, నిర్మాత కావడం ఓ విశేషం అయితే... లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ను ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. ఏడేళ్ల తర్వాత ఈ స్టార్‌ హీరోలిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం మరో విశేషం. అజయ్‌ దేవగణ్‌ ఎఫ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై అజయ్‌ దేవగణ్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అంగీరా ధార్‌ కథానాయికలు.
 
‘మే డే’ సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది. రెగ్యులర్‌ షూటింగ్‌ సైతం ఈ రోజే మొదలుపెట్టారు. అలాగే, ఏప్రిల్‌ 29, 2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తొలి సన్నివేశానికి అజయ్‌ దేవగణ్‌ స్నేహితుడు, ప్రముఖ తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్‌ ఇచ్చారు. ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘తానాజీ’ చిత్రానికి సైతం ఆయనే క్లాప్‌ ఇచ్చారు. ఆ సెంటిమెంట్‌ మరోసారి వర్కవుట్‌ అవుతుందని ఆశించవచ్చు.
 
ఈ సందర్భంగా అజయ్‌ దేవగణ్‌ మాట్లాడుతూ ‘‘ఈ రోజు ‘మే డే’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా పూర్తయ్యేవరకూ ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. భగవంతుడితో పాటు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం కోరుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానుల మద్దతుతో పూర్తి చేస్తాం. ఏప్రిల్‌ 29, 2022న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
 
ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్‌ - ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), చిత్రనిర్మాణ సంస్థ: అజయ్‌ దేవగణ్‌ ఎఫ్‌ ఫిల్మ్స్‌, ఛాయాగ్రహణం: అశీమ్‌ బజాజ్‌, సహ నిర్మాతలు: కుమార్‌ మంగత్‌, విక్రాంత్‌ శర్మ, హస్నైన్‌ హుస్సేని, జయ్‌ కనుజియా, సందీప్‌ కెవ్లాని, తార్‌లోక్‌ సింగ్‌, నిర్మాణం–దర్శకత్వం: అజయ్‌ దేవగణ్‌.