శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (16:56 IST)

కొత్త హీరో సెట్లోకి రాగానే లేచి నమస్కారం పెట్టాల్సి వస్తోంది: చంద్రమోహన్

టాలీవుడ్‌లో ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని సీనియర్ కథానాయకులలో ఒకరైన చంద్రమోహన్ అన్నారు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు.. సీనియర్ నటులకు ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. గతంలో తాము హ

టాలీవుడ్‌లో ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని సీనియర్ కథానాయకులలో ఒకరైన చంద్రమోహన్ అన్నారు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు.. సీనియర్ నటులకు ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. గతంలో తాము హీరోలుగా నటించినా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయేసరికి కొత్త హీరో సెట్లోకి రాగానే లేచి నిల్చుని నమస్కారం పెట్టాల్సి వస్తుందన్నారు. 
 
ఇక ఆ హీరో రెండేళ్ల తర్వాత ఉంటాడో లేదో కూడా తెలియదన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి తాము ఎంతో క్రమశిక్షణతో నటనను నేర్చుకున్నామని, కానీ ప్రస్తుతం సీన్ మారిందని చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీన్ ఇలా చేస్తే బాగుంటుందని కూడా నోరు విప్పి చెప్పకూడదని.. అలా ఓ హీరోకి చెప్పినందుకు దర్శకుడికి ఫిర్యాదు చేశాడని, దర్శకుడైతే ఆ హీరో జోలికి వెళ్లొద్దని దణ్ణం పెట్టేశాడని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
ఇంకా తనతో ఏ హీరోయిన్ నటించినా ఆ తరువాత టాప్ పొజీషన్‌కి వెళ్ళిపోతారని సెంటిమెంట్ వుండేది. ఇందుకోసం తనతో జోడీ కట్టేందుకు హీరోయిన్లు పోటీపడేవారని చంద్రమోహన్ తెలిపారు. రాధిక, విజయశాంతి, సులక్షణ, శ్రీదేవి, జయసుధ, జయప్రద వీళ్లంతా తనతో నటిస్తే టాప్ పొజిషన్‌కు వెళ్లిపోతామని భావించేవాళ్లు. 
 
ఈ సెంటిమెంట్ కాకతాళీయమేనని తాను నమ్మినా.. తనతో నటించిన హీరోయిన్లు తప్పకుండా అగ్రహీరోయిన్లుగా ఎదిగేవారని చెప్పారు. సెంటిమెంట్ కారణంగా మాధవి, రాధిక, విజయశాంతి తనతో ఏడెనిమిది సినిమాలు చేశారు. ఒక్క జయసుధతో మాత్రం 25 సినిమాల వరకూ చేశానని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.