గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (13:09 IST)

అమ్మాయిలు ఇష్టం లేకుండానే మగవారి గదుల్లోకి వెళ్తున్నారా?: ఆండ్రియా

మీటూ ఉద్యమం సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంటోంది. పలు రంగాల్లో మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గూర్చి సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం మీటూ ఉద్యమంలో వాస్తవం లేదంటున్నారు. అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలను ప్రస్తుతం బయటపెట్టి ప్రయోజనం ఏముంటుందని వాదిస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్‌బాస్ -11 విన్నర్ శిల్పా షిండే కూడా మీటూ ఉద్యమం బూటకమని చెప్తోంది. 
 
బిగ్‌బాస్-11 విజేత శిల్పాషిండే మాత్రం మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరిపైనా అత్యాచారం కాని లైంగికదాడికి కానీ పాల్పడరని ఇదంత ఇద్దరి మధ్య లేదా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే లైంగిక కలయిక జరుగుతుందని చెప్పారు. ఇదంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగుతుందని వ్యాఖ్యానించింది. 
 
ఇదే తరహాలో మీటూ ఉద్యమం మిన్నంటుతున్న వేళ, దక్షిణాది నటి ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది. తానైతే 'మీటూ' ఉద్యమాన్ని స్వాగతిస్తున్నానని చెబుతూనే, స్టార్‌గా వెలిగిపోవాలని, రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలని భావిస్తున్న అమ్మాయిలు, వారికి ఇష్టం లేకుండానే మగవారి గదుల్లోకి వెళుతున్నారా? అని అడిగింది. 
 
తప్పు మగవారిది మాత్రమే కాదని, మహిళలు అంగీకరించకుంటే, ఎవరూ పిలవరని, ఎవరిపై వారికి నమ్మకం ఉంటే పడక గదుల్లోకి రావాలని ఎవరూ పిలవరని ఆండ్రియా స్పష్టం చేసింది. ఇప్పటివరకూ అవకాశాల పేరు చెప్పి తనను ఎవరూ వాడుకోవాలని చూడలేదని చెప్పింది.
 
పని కావాలంటూ వెళ్లే మహిళలు అందుకు అంగీకరించకుండా ఉంటే ఎలాంటి సమస్యా తలెత్తదని ఆండ్రియా వెల్లడించింది. తనకు టాలెంట్ ఉంది కాబట్టే, ఎవరి గదిలోకీ వెళ్లకుండానే అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.