శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 24 మే 2021 (19:25 IST)

రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నిస్తున్న దేవ‌క‌ట్టా

Deva katta
ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా పుట్టిన‌రోజు నేడే. మే 24వ తేదీ. అందుకే ఆయ‌న తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా `రిప‌బ్లిక్‌` టీమ్ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడు. మ‌న వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఎత్తిచూపుతూ ఆమ‌ధ్య టీజ‌ర్ విడుద‌ల చేశారు. క‌రోనా కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది. సాయితేజ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన ఈ సినిమాను జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అందరిలో ఓ సరికొత్త చర్చకు తెర తీసింది.
 
చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ‘రిపబ్లిక్’ పేరుతో మీరు తీసిన సినిమాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎదురుచూస్తున్నాను అంటూ హీరో సాయితేజ్ ట్వీట్ చేస్తే, ‘ఈ సినిమాలోని పాత్ర కోసం నిన్ను నువ్వు మలుచుకున్న తీరును ప్రేక్షకుల ముందు ఆవిష్కరించడానికి నేనూ ఎంతో ఆసక్తితో ఉన్నాను’ అంటూ దేవ కట్టా బదులిచ్చారు.
 
దేవ‌క‌ట్టా పుట్టింది క‌డ‌ప‌. చ‌దువు చెన్న‌య్‌. ఇంజనీరింగ్ చేశాడు. ఆయ‌న‌కు సినిమారంగ‌మంటే ఆస‌క్తి. అందుకే మేకింగ్ కోసం అమెరికా వెళ్ళి నేర్చుకుని వ‌చ్చాడు. అందుకే ఆయ‌న సినిమాలు ఆలోచించేవిధంగా వుంటాయి. తొలిసారిగా అక్క‌డ వారితోనే `వెన్నెల‌` సినిమా చేశాడు. ఆయ‌న స్నేహితులే నిర్మాత‌లు. ఆ సినిమాలోని హీరో రాజాకు ఎంత పేరు వ‌చ్చినా, దానికి రెండు రెట్లు  కిశోర్‌కు బాగా పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాత వెన్నెల కిశోర్‌గా ఆయ‌న మారిపోయాడు. 
 
ఆ త‌ర్వాత చాలా గేప్ తీసుకుని రాజ‌కీయ నేప‌థ్యంలో ‘ప్రస్థానం’ తీశాడు. విభిన్నంగా వుంద‌ని టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ మధ్య సన్నివేశాలు ఆక‌ట్టుకున్నాయి. ఆ సినిమాతోనే సందీప్‌కిష‌ణ్ అనే ఆర్టిస్టు వున్నాడ‌నే తెలిసింది. సినిమాకు నంది అవార్డు వ‌చ్చింది కూడా. ఆ సినిమాను సంజ‌య్ ద‌త్ హిందీలో త‌నే చేశాడు. ఆ త‌ర్వాత దేవ‌క‌ట్టా కొంత గేప్ త‌ర్వాత దేవ‌క‌ట్టా చేసిన ఆటోన‌గ‌ర్ సూర్య పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. హీరో స్థాయికి మించిన పాత్ర కావ‌డంతో స‌రిగ్గా తీయ‌లేద‌నే విమ‌ర్శ కూడా ద‌క్కించుకున్నాడు. ఇక అనంత‌రం తమిళ సినిమా ‘అరిమ నంబు’ను తెలుగులో ‘డైనమేట్’గా రీమేక్ చేశాడు. అదీ ఆడ‌లేదు.
 
అయినా మొక్క‌వోని దీక్ష‌తో త‌నకు న‌చ్చిన అంశాల‌తో సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చాడు. సాహిత్యంపై ప‌ట్టు వున్న ఆయ‌న న‌వ‌ల‌లు ఎక్కువ‌గా చ‌దువుతాడు. ప్ర‌స్తుతం ట్రెండ్ మార‌డంతో వెబ్ సిరీస్‌పైనా క‌న్ను వేశాడు. ఎన్టీయార్, రాజశేఖర్ రెడ్డి పాత్రలను ఫిక్షనల్ క్యారెక్టర్స్ గా చేస్తే ఎలా వుంటుంద‌నే ఆలోచ‌న‌లో వున్నాడు. ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా స‌క్సెస్ రేటు లేని దేవ‌క‌ట్టాకు రిప‌బ్లిక్ పెద్ద మైలురాయిలా వుంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే మ‌న రాజ్యాంగంలోని లోపాలు అంద‌రికీ తెలిసివే. కానీ వాటిని హైలైట్ చేస్తూ తీసిన ఈ సినిమాకు సెన్సార్ నుంచి బ‌య‌ట‌ప‌డి విడుద‌ల కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. థియేట‌ర్లు ఓపెన్ చేశాక కేవ‌లం థియ‌ట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌నుకుంటున్న దేవ‌క‌ట్టా ఈ సినిమాతో ఏమేర‌కు గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.