బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (18:23 IST)

టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం-కత్తి మహేష్ మృతి

టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటులు కోల్పోయిన పరిశ్రమ…. తాజాగా సినీ విమర్శకుడు, నటుడు అయిన కత్తి మహేశ్‌ను కోల్పోయింది. కాసేపటి క్రితమే కత్తి మహేశ్‌ మృతి చెందారు. యాక్సిడెంట్‌లో తలకు బలమైన గాయాలతో ఆస్పత్రి పాలైన కత్తి మహేష్.. ఇవాళ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
 
 



కాగా.. చెన్నై-కొల్కత్తా రహదారిపై గత నెలలో తెల్లవారు జామున.. కత్తి మహేష్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 
 
సినీ విమర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన సినిమాల్లో ఆర్టిస్ట్‌గా నటించారు. 'మిణుగురులు' చిత్రానికి కో-రైటర్‌గా పని చేశారు. సంపూ కెరీర్‌లో సూపర్ హిట్ ఇచ్చిన 'హృదయ కాలేయం' చిత్రంలో పోలీస్‌గా, 'నేనే రాజు నేనే మంత్రి', 'క్రాక్‌' వంటి చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించారు. 'పెసరట్టు' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం సరిగ్గా ఆడకపోవడంతో విమర్శల పాలయ్యారు.
 
అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ పై సినీ, రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లో కొన్ని రోజుల పాటు కంటెస్టెంట్‌గా ఆయన పాల్గొన్నారు.
 
సమాజంలోని ఓ వర్గంవారి మనోభావాలను దెబ్బతీస్తుండటంతో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్‌ పోలీసుల నుంచి ఆరు నెలల పాటు నగర బహిష్కరణను ఆయన ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి, హిందువుల ఆగ్రహానికి గురయ్యారు.
 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత సన్నిహితుడని పేరు పొందారు కత్తి మహేష్‌. యాక్సిడెంట్‌ తర్వాత అతని చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ప్రకటించడంతో చర్చనీయాంశమైంది. కోలుకుంటున్నట్లుగా రీసెంట్‌గా వార్తలు వచ్చినా.. అకస్మాత్తుగా ఆయన మరణవార్త వినాల్సిరావడం బాధాకరం.