మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) పథకాలు అద్భుతం - మెగాస్టార్ చిరంజీవి
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఇటీవలే కొత్త పథకాల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు మా అధ్యక్షకార్యదర్శకులు శివాజీ రాజా, సీనియర్ నరేష్ ఈ పథకాల వివరాల్ని అందించారు. మా డైరీ ఆవిష్కరణలో సూపర్‌స్టార్ కృష్ణ- విజయ నిర్మల, రెబల్‌స్టార్ కృష్ణంరాజు- శ్యామలా దేవి దంపతులు ఈ పథకాల్ని ప్రశంసించి తమవంతు సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ పథకాలకు ప్రత్యేకించి విడివిడిగా నామకరణం చేసింది మా అసోసియేషన్. ఈ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, మూవీ ఆర్టిస్టుల సంఘం మంచి పనులు చేసేందుకు ప్రతిసారీ ముందుకొస్తోందని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. మా అధ్యక్షుడు శివాజీరాజా, ఇతర సభ్యుల కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
2019 జనవరి -1 నుంచి `మా అసోసియేషన్` తమ మెంబర్స్ కోసం ప్రవేశపెట్టిన పథకాల వివరాలివి. `డా.చిరంజీవి మా కళ్యాణ లక్ష్మి పథకం` పేరుతో రూ.1,16,000 మొత్తాన్ని పెళ్లి చేసుకునే ఆడపిల్లకు అందజేస్తారు. `డా.ఏఎన్నార్ మా విద్యా పథకం` పేరుతో 80 శాతం స్కోర్ చేసిన పిల్లలకు రూ.1,00,000 అందజేస్తారు. డా.విజయనిర్మల మా చేయూత పథకం పేరుతో వృద్ధులకు నెలవారీ ఫించను రూ.5000 చొప్పున అందిస్తారు.
ఇదివరకూ రూ.2000గా ఉన్న ఫించనును రూ.5000కు పెంచారు. 35 మంది సభ్యులకు ఈ ఫించను అందనుంది. `శ్రీకాంత్ మా మానవతా ఎల్ఐసీ పథకం` పేరుతో రూ.3,00,000 ఇన్సూరెన్స్ సదుపాయం మెంబర్స్‌కి కలగనుంది. ఇలాంటి ఉదాత్తమైన పథకాలు భారతదేశంలోనే వేరొక సినీ పరిశ్రమలో ఎక్కడా అమలు చేయలేదని పరిశ్రమ ప్రముఖులు ప్రశంసలు కురిపించడం విశేషం.