ఏపీ మంత్రి పేర్ని నానికి వర్మ ప్రశ్నలు.. అలా చేస్తే మీకు ఓట్లు.. మాకు నోట్లు!
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. ఇపుడు 11 కీలక ప్రశ్నలను సంధించారు. తానిచ్చే సలహా మేరకు ప్రభుత్వం నడుచుకుంటే ప్రభుత్వానికి ఓట్లు, మాకు (నిర్మాతలు) నోట్లు వస్తాయన్నారు. అలాగే, ఆర్జీవీ సంధించిన ప్రశ్నల వివరాలను పరిశీలిస్తే...
* అసలు సినిమాలు సహా ఏ వస్తువైనా సరే దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అసలు ప్రభుత్వ పాత్ర ఏంటి?
* తీవ్రమైన కొరత ఉన్నపుడు పిండి, బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసర వస్తువులు ధరలు ఒక స్థాయికి మించి పడిపోయినా.. పెరిగినా ప్రభుత్వం కలుగజేసుకుని ఆ ధరను సరిదిద్దుతుందని నాకు తెలుసు. కానీ ఇది సినిమాలకు ఎలా వర్తిస్తుంది?
* ఒకవేళ సినిమా కూడా పేదవారికి నిత్యావసర వస్తువు అని ప్రభుత్వం భావిస్తే.. ప్రభుత్వం దీన్ని కూడా మెడికల్, ఎడ్యుకేషనల్ సేవల విషయంలో చేసినట్టే సబ్సిడైజ్ చేసి మిగతా డబ్బుతో మీ జేబులో నుంచి ఇవ్వొచ్చు కదా?
* బియ్యం, పంచదార వంటి వస్తువులను పేదలకు అందించేందుకు రేషన్ షాపులు పెట్టినట్టే రేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారా?
* ద్వంద్వం ధర విధానంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించొచ్చేమో. అంటే నిర్మాతలు ఒక ధరకు తమ టిక్కెట్లను అమ్ముకుంటారు. వాటిలో కొన్నింటిని ప్రభుత్వం కొనుగోలు చేసిన పేదలకు తక్కువ ధరకు విక్రయించవచ్చు. ఇలా చేస్తే మీకు ఓట్లు.. మాకు నోట్లు (డబ్బులు) వస్తాయి.
* అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల ధరలు ఉత్పత్తి వ్యయం మరియు ట్రాక్ రికార్డు ఆధారంగా ఎంత రికవరీ అవుతుందనే అంశాల మధ్య తేడాను బట్టే ఉంటుందని మీ గౌరవ బృందం అర్థం చేసుకోవాలి.
ఇలా అనేక ప్రశ్నలను మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ సంధించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆర్జీవీ ట్వీట్లను అనేకమంది సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.