ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 16 సెప్టెంబరు 2019 (21:43 IST)

సైరాకు ఊహించని షాక్... అస‌లు ఏమైంది..?

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ చరిత్రాత్మక చిత్రం సైరా. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. 
 
ఈ సంచ‌ల‌న చిత్రాన్ని గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబర్- 02న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా జరపాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో సైరాకు ఊహించని షాక్ తగిలింది. 
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వంశీయులు పోరాటానికి దిగారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కార్యాలయం ముందు సైరా వంశీయులు ఆందోళన నిర్వహించారు.
 
సైరా సినిమా తీసేందుకు కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు.. సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్‌లతో పాటు, నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పూర్తిగా తమ నుంచి తెలుసుకొన్నారని వారు చెబుతున్నారు. 
 
అయితే కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్‌ను పూర్తి చేసుకొని.. ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని వారు చెబుతున్నారు. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
స్థానిక సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి స్థానికంగా ఉన్న పీఎస్‌కు తరలించారు. అయితే... చిరు వారికి ఏమిస్తామని మాటిచ్చారు..? ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు..? మరి ఇదే ఆందోళన కొనసాగిస్తే మున్ముందు ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌నున్నాయి అనేది ఆస‌క్తిగా మారింది.