శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 మే 2023 (09:30 IST)

రాజమౌళి గారిని అడిగితే ఇదే సలహా ఇచ్చారు : హను-మాన్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

director Prashant Varma
director Prashant Varma
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం 'హను-మాన్‌'. టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌ టైన్‌మెంట్‌ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  
 
'హను-మాన్‌' రిలీజ్ డేట్ ఎప్పుడు ?
వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. జూన్ చివరికి పూర్తవుతాయని ప్రామిస్ చేశారు. చివర్లో చూసి క్వాలిటీ పరంగా రెడీ అనుకున్నప్పుడు జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామని భావిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ వర్క్ మన చేతిలో ఉండదు. ఒకొక్క షాట్ రెండర్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అమెరికా, చైనా రెండర్స్ వాడుతునప్పటికీ చాలా సమయం తీసుకుంటుంది. టీజర్ విడుదల చేసిన తర్వాత అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలని అందుకోవడానికి ఇంకొంత యాడ్ చేశాం. టైం ఇస్తే వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగా వస్తాయి.
 
టీజర్ చూసిన తర్వాత ట్రైలర్, సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దాని కోసం మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారు ?
టీజర్, ట్రైలర్ ఒకేసారి కట్ చేశాం. నేను చూపించిన వారికి టీజర్ నచ్చలేదు. ట్రైలర్ నచ్చింది. కాబట్టి ..నో వర్రీస్. ట్రైలర్ ఇంకా బాగుంటుంది.
 
కథ పరంగా ఏదైనా కొత్తగా యాడ్ చేశారా ?
కథ పరంగా ఒక క్యారెక్టర్ ని యాడ్ చేశాం. సినిమా అంతా చూసుకున్న తర్వాత 95 శాతం రీచ్ అయినట్టు అనిపించింది. ఐదు శాతం ఏదో మిస్ అవుతుందని చర్చించిన తర్వాత ఒక పాత్ర యాడ్ చేస్తే 100 శాతం అవుతుందనిపించింది. ఆ పాత్ర షూట్ చేసి యాడ్ చేసి చూసుకున్నాక 200 శాతం అయ్యింది.
 
ఇన్ని భాషల్లో విడుదల చేయాలని ముందే అనుకున్నారా?
మొదట తెలుగు అనుకున్నాం. టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత హిందీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత తమిళ్ ,కన్నడ ,మలయాళం నుంచి రెస్పాన్స్ వచ్చింది. మేము క్రియేట్ చేసిన ప్రోడక్ట్ కి డిమాండ్ వచ్చింది. వాళ్ళు అడగకపోయివుంటే తెలుగు వరకే ఫిక్స్ అయ్యేవాళ్ళం.
 
రామాయణం ను ప్రామాణికంగా చూపించాలా ? లేదా ఇప్పటి సూపర్ హీరోస్ లా ప్రయోగాత్మకంగా చేయాలా అనే చర్చ నడుస్తుంది కదా..  మరి హనుమాన్ ఎలా వుంటుంది?
ఇలాంటి సినిమాలు చేసినప్పుడు కచ్చితంగా అంచనాలు ఉంటాయి. వాటిని ప్రజంట్ చేయడం కూడా ఒక సవాల్ తో కూడుకున్నదే. ఐతే మేము అంత సవాల్ తీసుకోలేదు. మేము చెప్పే కథ ప్రస్తుతంలో జరుగుతుంది. హనుమంతుడు కథలో జరిగిన ఒక కీలక సంఘటనని తీసుకొని చేశాం. హనుమంతుని కథలో ఓ సంఘటన జరిగింది కాబట్టి అక్కడి నుంచి ఇలా జరిగుంటే ఎలా ఉంటుందనే అంశంపై బిల్డ్ చేసిన కథ. చాలా వరకూ కథ కరెంట్ టైమ్స్ లో వుంటుంది. హనుమంతుడిని ఎలా చూడాలని చిన్నప్పటినుంచి అనుకుంటున్నారో అది ఐతే ఇందులో చూపించగలుగుతున్నాను. హనుమంతుడు ఎలా కనిపించాలనే క్యారెక్టర్ స్కెచ్ పైనే దాదాపు ఏడాది పాటు పని చేశాం.
 
ఒక సూపర్ హీరో కథ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నేను డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. తెలుగులో గొప్ప దర్శకులు చాలా  అద్భుతమైన చిత్రాలు తీశారు. వాళ్ళ కంటే నేను బెటర్ గా తీయలేను. నాకంటూ ఒక యునిక్ జోనర్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో భాగంగా ఇప్పటి వరకు  ఎక్స్ ఫ్లోర్ చేయని జోనర్స్ పై దృష్టి పెట్టాను. ఆ క్రమంలో అ, కల్కి, జాంబి సినిమాలు చేశాను. తర్వాత ఏం జోనర్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు .. సూపర్ హీరోస్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను స్పైడర్ మ్యాన్ అవుదామని తిరిగాను. సాలె పురుగుకుట్టలేదు. నేను అవ్వలేదు(నవ్వుతూ). నాలాగే చాలా మందికి వుంటుంది. ఇంటర్ నేషనల్ మార్కెట్ లో సూపర్ హీరో అనేది కమర్షియల్ జోనర్. మనం ఎందుకు సూపర్ హీరో ఫిల్మ్ ప్రయత్నించకూడదని స్టార్ట్ చేశాం.
 
ఈ పాత్రకు తేజ తోనే ఎందుకు చేయాలనిపించింది?
ఈ పాత్రకు ఒక అండర్ డాగ్ కావాలి. ఒక సామాన్యుడికి సూపర్ హీరో పవర్స్ వస్తేనే ఆసక్తికంగా వుంటుంది. తేజ కి వున్న ఇమేజ్ కి ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాడనిపించింది. తనకి పవర్స్  వచ్చి కొడితే ఇంకా ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. ఈ పాత్రకు తేజ వంద శాతం న్యాయం చేశాడు. దీని కోసం స్పెషల్ గా మేకోవర్ అయ్యాడు.
 
ఈ సినిమాలో వరలక్షీ శరత్ కుమార్ గారితో పాటు ఇంకా ఎవరెవరు వున్నారు ?
వినయ్ రాయ్ సూపర్ విలన్ గా కనిపిస్తారు. అలాగే రాజ్ దీపక్ శెట్టి మేజర్ రోల్ పోషిస్తున్నారు. ఇంకో పెద్ద ఆర్టిస్ట్ చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల  చేస్తాం
 
అధీర సినిమా గురించి ?
అది ప్రీప్రొడక్షన్ జరుగుతోంది. అది కూడా సూపర్ హీరో ఫిల్మ్. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచే వుంటుంది. హనుమాన్ లో వుండే కొన్ని పాత్రలు అందులో వుంటాయి. చాలా డిఫరెంట్ గా వుంటుంది. మార్వల్ సిరిస్ లా అన్నీ కనెక్టింగా వుంటాయి.
 
హను మాన్ విదేశీ భాషల్లో కూడా విడుదలౌతుందా ?
పాన్ ఇండియా ఒకేసారి విడుదల చేస్తాం. విదేశీ భాషల విషయానికి వస్తే ప్రొమోషన్ కి సమయం సరిపోదు. రాజమౌళి గారిని అడిగితే ఇదే సలహా ఇచ్చారు. నెల రోజుల తర్వాత అక్కడ విడుదల చేస్తాం.
 
హనుమాన్ విషయంలో రాజమౌళి గారు సూచనలు ఇచ్చారా ?
టీజర్ విడుదలైన తర్వాత నేనే ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కలిశాను. ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. దాని వలన మాకు చాలా సమయం కలిసొచ్చింది.
 
మీ బర్త్ డే స్పెషల్ ప్లానింగ్స్ ఏమిటి ?
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పివిసియు) ని నా బర్త్ డే రోజున అనౌన్స్ చేస్తాను. రాబోయే పదేళ్ళ లో ఒక పెద్ద ఫ్రాంచైజ్ క్రియేట్ చేయడంపై ద్రుష్టి పెట్టాం. దాదాపు 8 సూపర్ హీరో ఫిలిమ్స్ వస్తాయి.  ఇది నా ఒక్కడి వలన కాదు. యువ ప్రతిభని ఇన్వైట్ చేస్తున్నాను. సుమారు వందమంది టీంతో ఒక హాలీవుడ్ స్టూడియోలా నడపాలనేది నా ఆలోచన. దిని కోసం గత కొన్నాళ్ళు గా పని చేస్తున్నాను. బర్త్ డే రోజు అనౌన్స్ మెంట్ వుంటుంది.