ఎన్టీఆర్ బయోపిక్ చూడలేదు... ఎందుకంటే? కారణం బయటపెట్టిన దర్శకుడు తేజ
నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ మహా నాయకుడు. జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిదే. ఈ రెండు చిత్రాలు ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే... ఎన్టీఆర్ బయోపిక్‌కి మొదట దర్శకుడు తేజ. ఓపెనింగ్ కూడా జరిగింది. మరి... ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ... తేజ తప్పుకోవడం.. క్రిష్ రంగంలోకి రావడం జరిగింది.
ఎన్టీఆర్ బయోపిక్ రిలీజై చాలా రోజులు అయ్యింది కానీ... తేజ ఎన్టీఆర్ బయోపిక్‌ని ఇప్పటివరకు చూడలేదట. ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... నేను ఎన్.టి.రామారావు గారికి న్యాయం చేయలేను అనిపించింది. నాకు అంత స్టామినా లేదు. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన జీవితాన్ని కథగా మార్చి సినిమా తీసేంత టాలెంట్ నాకు లేదనిపించింది. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకున్నాను. ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. దాని తర్వాత కథ డెప్త్ లోకి వెళితే నేను డెఫినెట్‌గా రామారావు గారికి న్యాయం చేయలేను అని ఫీలయ్యాను.
ఆయన నా ఫేవరేట్ హీరో. నాకు బాగా ఇష్టం. ఎంజిఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ బాగా ఇష్టం. నేను న్యాయం చేయలేను అనిపించింది. అందుకే వదిలేసాను అని చెప్పారు. ఎన్టీఆర్ కథానాయకుడు కానీ.. ఎన్టీఆర్ మహానాయకుడు కానీ.. ఈ రెంటింటిలో ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు అన్నారు. ఎందుకు చూడలేదు అని అడిగితే... చూసిన దగ్గర నుంచి నేనైతే ఎలా తీసేవాడిని. అలా తీసేవాడిని అని ఏదొటిక మాట్లాడుతాను. ఎందుకొచ్చిన తలకాయ నొప్పి అని చూడలేదు అంటూ అసలు విషయం బయటపెట్టారు తేజ.