ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (12:00 IST)

ప్రభుత్వం తరపున తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహించాలి.. డాక్టర్ నూనె అంకమ్మ రావు

Telugu Language Day
Telugu Language Day
వ్యావహారిక భాషా పితామహుడు, పండితుల భాషను ప్రజల భాషగా మలచిన మహానుభావుడు అయిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం అని కళామిత్రమండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మ రావు అన్నారు. 
 
స్థానిక గుంటూరు రోడ్డులోని ఫ్లై ఓవర్ క్రింద ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద  కళామిత్రమండలి, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ సభకు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ గారు అధ్యక్షత వహించారు. 
 
ఈ సభలో వివిధ సాహితీ సాంస్కృతిక కళా రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించారు. ప్రముఖ సాహితీవేత్త నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కుర్రా ప్రసాద్ బాబు, సుప్రసిద్ధ ప్రజా గాయకుడు శ్రీ నూకతోటి శరత్ బాబు, నాటక రంగ ప్రముఖులు శ్రీ మిడసల మల్లికార్జునరావు ,ప్రముఖ పాత్రికేయులు శ్రీ మాగంటి శ్రీనివాసమూర్తి గార్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. 
 
ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలతో అలంకరించి, మదరాసీలుగా గుర్తింపబడే తెలుగు వారికి ప్రపంచఖ్యాతిని తీసుకువచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, గిడుగు వారి విగ్రహాలకు,
చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, నినాదాలు చేశారు. ప్రభుత్వం తరపున కూడా తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. 
 
కార్యక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి, నాళం నరసమ్మ, బీరం అరుణ,అంగలకుర్తి ప్రసాద్, ధేనువుకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.