గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (09:14 IST)

బంగార్రాజు... సోగ్గాడు మళ్లీ పుట్టాడు మూవీ రివ్యూ

Bangarraju poster
న‌టీన‌టులుః నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, ర‌మ్యకృష్ణ‌, కృతిశెట్టి, రావుర‌మేష్‌, మ‌హేష్ త‌దిత‌రులు
 
సాంకేతిక‌తః కెమెరాః జె. యువ‌రాజ్‌, సంగీతంః అనూప్ రూబెన్స్‌, నిర్మాత‌లుః నాగార్జున‌, జీ స్టూడియోస్‌, ద‌ర్శ‌క‌త్వంః క‌ళ్యాణ కృష్ణ‌.

 
సోగ్గాడు మ‌ళ్ళీ పుట్టాడు అనే టాగ్‌లైన్‌తో రూపొందిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయ‌నా‘ వ‌చ్చి ఆరు సంవ‌త్స‌రాలైంది. అప్ప‌టి చిత్రానికి దీనికి సీక్వెల్‌ తీయాల‌ని అనుకున్నారు. ఇప్ప‌టికి సెట్ అయి విడుద‌లైంది. నాగార్జునకు నాగ‌చైత‌న్య మ‌న‌వ‌డుగా న‌టించాడు. దాన్ని ఎలా ద‌ర్శ‌కుడు మ‌లిచాడ‌నేది చూద్దాం.
 
క‌థః
శివ‌పురం అనే ఊరు. అక్క‌డ శివాల‌యం ధ‌ర్మ‌క‌ర్త పెద్ద బంగార్రాజు. శివాల‌యంలో వుండే మ‌ణుల‌ను ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న బంధువులు నాజ‌ర్ త‌న అనుచ‌రుల‌తో బంగార్రాజును చంపేస్తారు. అలా స్వ‌ర్గానికి వెళ్ళిన బంగార్రాజు అక్క‌డ రంభ ఊర్వ‌శి మేన‌క‌ల‌తో తైత‌క్క‌లాడుతుంటాడు. ఆ టైంలోనే బంగార్రాజు భార్య స‌త్య‌భామ వ‌స్తుంది. త‌నుకూడా చ‌నిపోయింద‌ని తెలుసుకున్న‌ బంగార్రాజు త‌న కొడుకు రామ్మోహ‌న్ యు.ఎస్‌. వెళ్ళిపోవ‌డం, కోడ‌లు చ‌నిపోవ‌డం తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోతాడు.


స‌త్య‌భామ కూడా చ‌నిపోవ‌డంతో మిగిలిన‌ మ‌న‌వడు ఒక్క‌డే ఏమ‌యిపోతాడ‌నే బెంగను బంగార్రాజుకు స‌త్య‌భామ వ్య‌క్తం చేస్తుంది. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే ఇంద్రుడు, య‌మ‌ధ‌ర్మ‌రాజు క‌లిసి శివ‌పురంలో 24 సంవ‌త్స‌రాల‌కోసారి జ‌రిగే శివ ఉత్స‌వం స‌రిగ్గా జ‌ర‌గాలంటే త‌ప్ప‌నిస‌రిగా బంగార్రాజు ఆత్మ మాన‌వ‌లోకం వెళ్ళాల‌ని నిర్ణ‌యించి కింద‌కు పంపుతారు.


ఆ త‌ర్వాత పెద్ద బంగార్రాజు వ‌చ్చి మ‌న‌వడు చిన్న బంగార్రాజు(నాగ‌చైత‌న్య‌)కు ఊరి స‌ర్పంచ్ నాగ‌ల‌క్ష్మి(కృతిశెట్టి)తో పెండ్లి చేయాల‌ని చూస్తారు. సాఫీగా జ‌రుగుతున్న త‌రుణంలో చిన్న బంగార్రాజు ప్రాణానికి ప్ర‌మాదం అని తెలుస్తుంది. అప్పుడు క‌థ ఏ మ‌లుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.

 
విశ్లేష‌ణ‌
సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు వుండ‌డంతో చాలా ఆస‌క్తిగా సాగుతుంది. బంగార్రాజు ఆత్మ వ‌చ్చి కొడుకును ఏవిధంగా ర‌క్షించాడు. ఆ త‌ర్వాత‌ అస‌లు త‌ను మామూలుగా మ‌ర‌ణించ‌లేద‌ని తెలుసుకుని ఆశ్చ‌ర్య‌ప‌డ‌డం వంటికి ప్రేక్ష‌కుడికి న‌చ్చాయి. ఇక ఈ బంగార్రాజు సినిమాలో మ‌న‌వ‌డిని ర‌క్షించ‌డానికి త‌నేం చేశాడు అనేది క‌థ కాబట్టి. మ‌న‌వ‌డుకి ఓ ల‌వ్ ట్రాక్ కృతిశెట్టితో చేసి ఆ పార్ట్ ఆస‌క్తిగా మ‌లిచాడు. ఇక మిగిలిన క‌థంతా మామూలే. అందుకే ఎక్క‌డా థ్రిల్ క‌ల‌గ‌దు.
 
 
ఆరేళ్ళ నాడు ఎలా తెర‌పై క‌నిపించారో ఇప్పుడూ నాగార్జున అదే మెయింటెయిన్ చేయ‌డం విశేషం. ఇక అందం మంద‌మైనా, ఇప్ప‌టికీ ఆక‌ర్ష‌ణీయంగానే ఉన్న ర‌మ్య‌కృష్ణ సైతం అదే తీరున మురిపించారు. ఇద్ద‌రికీ ఓ యుగ‌ళ‌గీతం కూడా వుంటుంది. కృతి శెట్టి మేధావిన‌నే తింగ‌రి పాత్ర‌లో అమ‌రింది. రావు ర‌మేశ్, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిశోర్, ఝాన్సీ త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు.

 
భాస్క‌ర‌భ‌ట్ల రాసిన‌ ల‌డ్డుండా.. పాట విన‌డానికే కాదు, అందుకు త‌గ్గ పిక్చ‌రైజేష‌న్ తోనూ ప‌ర్వాలేద‌నిపించింది. మిగిలిన పాట‌ల్లో ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ప‌లికించిన‌ వాసివాడి త‌స్సాదియ్యా... కూడా మాస్‌ను ఆక‌ట్టుకునేలా సాగింది. సోగ్గాడే చిన్నినాయ‌నాతో పోలిస్తే, ఈ సారి పాట‌ల్లో అంత ప‌స క‌నిపించ‌లేద‌నే చెప్పాలి. అనూప్ రూబెన్స్ త‌న ప‌రిధి మేర‌కు విన‌సొంపైన సంగీతం అందించ‌డానికే కృషి చేశారు. జె.యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం కోన‌సీమ ప‌చ్చ‌ని అందాల త‌ర‌హాలో బెంగుళూరు శివార్ల‌లో తీసిన విలేజ్ బాగా చూపించాడు.


మొద‌టి భాగం అంత‌గా ఆక‌ట్టుకోదు. క‌థంతా రెండో భాగం కాబ‌ట్టి ప్రారంభం సో సోగా వున్న క్లైమాక్స్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబ‌ట్టి సంక్రాంతి సంద‌డిలో త‌న సంబ‌రాల‌తో గ‌ట్టెక్కుతాడ‌నే చెప్పాలి. క‌రోనా వ‌ల్లకావ‌చ్చు, పండ‌గ‌కు అంద‌రూ ఊళ్ళ‌కు వెళ్ళ‌డం కావ‌చ్చు. ఓపెనింగ్ రోజు మాత్రం థియేట‌ర్ల‌లో మంద‌కొడిగా హైద‌రాబాద్‌లో క‌నిపించింది.

 
సోగ్గాడు మ‌ళ్ళీ పుట్టాడు అనే టాగ్‌లైన్‌తో క‌థేమిటో చెప్పేశాడు కాబ‌ట్టి క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ లేద‌ని అర్థ‌మైంది.  అందుచేత భిన్న‌మైన క‌థ‌నం లేక‌పోవ‌డంతోపాటు ఆడియోప‌రంగా బాగా ఆక‌ట్టుకునేవి లేకపోవ‌డం లోపంగా క‌నిపిస్తాయి. 
 
రేటింగ్: 2.75 / 5