బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (15:16 IST)

మోహన్ లాల్ "లూసీఫర్‌"కు భిన్నంగా చిరంజీవి "గాడ్‌ఫాదర్".. ఫ్యాన్స్ మెప్పించిందా?

god father
మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ నటించిన చిత్రం 'లూసీఫర్'. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'గాడ్‌ఫాదర్' పేరుతో రీమేక్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి హీరో. సత్యదేవ్ విలన్. నయనతార విలన్ భార్య. పాటలు, డ్యాన్సులు లేని చిత్రం. దసరా కానుకగా అక్టోబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మలయాళ మాతృక 'లూసీఫర్‌'కు భిన్నంగా 'గాడ్‌ఫాదర్' ఉందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. 
 
నిజానికి ఈ చిత్రం విడుదల కాకముందే దర్శకుడు మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాస్త ఓపిక ఉంటే లూసీఫర్ చిత్రాన్ని మరోమారు చూసి 'గాడ్‌ఫాదర్' చిత్రం చూసేందుుక రావాలంటూ ప్రేక్షకులను కోరారు. ఎందుకంటే. 'లూసీఫర్‌'లో లేని అనేక అంశాలను 'గాడ్‌ఫాదర్‌'లో ఉన్నాయని ఆయన ముందుగానే చెప్పారు. చిత్రం విడుదలైన తర్వాత అవి నిజమని తేలింది. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
'లూసిఫర్‌' చూసిన వాళ్లు కూడా 'గాడ్‌ఫాదర్‌'ను ఎంజాయ్‌ చేసేలా దర్శకుడు తెరకెక్కించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీకే రామదాసు (పీకేఆర్‌) మరణంతో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు, కొద్దిసేపటికే అసలు కథేంటి? సినిమాలో పాత్రల తీరుతెన్నులు వివరంగా చెప్పేశారు. ఇక ప్రేక్షకుడు చూడాల్సింది తెరపై కనిపించే రాజకీయ చదరంగమే.
 
ఈ చదరంగంలో రెండు బలమైన పావులుగా ఒకవైపు బ్రహ్మ తేజగా చిరంజీవి, జైదేవ్‌గా సత్యదేవ్‌లు నిలబడ్డారు. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరు పైచేయి సాధిస్తారు. అయితే, బ్రహ్మ పాత్ర కీలకం కావడంతో అంతర్లీనంగా అతడే ఒక మెట్టుపైన ఉంటాడు. చిరంజీవి కనిపించే ప్రతి సన్నివేశమూ ఆయన్ను ఎలివేట్‌ చేసిన విధానం స్టైలిష్‌గా బాగుంది. ఆ సన్నివేశాలకు తమన్‌ నేపథ్యం సంగీతం థియేటర్‌ను ఓ ఊపు ఊపేసింది.
 
జన జాగృతి పార్టీ పగ్గాలు బ్రహ్మ చేపట్టకుండా జైదేవ్‌, అతడి మద్దతుదారులు చేసే పయత్నాలు, వాటిని బ్రహ్మ తిప్పి కొట్టడం ఇలా ప్రతి సన్నివేశమూ నువ్వా-నేనా అన్నట్లు ప్రథమార్ధం సాగుతుంది. విరామ సన్నివేశానికి ముందు జైలులో చిరు ఫైట్‌, సంభాషణలు అభిమానులు మెచ్చేలా ఉన్నాయి. 
 
ఆ తర్వాత సల్మాన్‌ రాకతో అసలు ట్విస్ట్‌ మొదలవుతుంది. అసలు బ్రహ్మ ఎవరు? మసూద్‌ గ్యాంగ్‌ అతడిని ఎందుకు సపోర్ట్‌ చేస్తుంది? జైదేవ్‌ కుట్రలను బ్రహ్మ ఎలా ఛేదించుకుంటూ వచ్చాడు? ఇలా ద్వితీయార్ధం ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో సాగుతుంది. ప్రథమార్ధంలో ఉన్నంత డ్రామా, ఎలివేషన్స్‌ ద్వితీయార్ధానికి వచ్చే సరికి కాస్త రొటీన్‌ అనిపిస్తాయి. 
 
పతాక సన్నివేశాల్లో పెద్దగా మెరుపులేవీ ఉండవు. అయితే, ఒకవైపు చిరంజీవి, మరోవైపు సత్యదేవ్‌లు తమ నటనతో అవి కనిపించకుండా చేశారు. ప్రతి సన్నివేశాన్నీ చిరు అభిమానులు మెచ్చేలా మోహన్‌రాజా తీర్చిదిద్దారు. హీరోయిజం ఎలివేట్‌ అయ్యేలా యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. 
 
వర్తమాన రాజకీయాలపై వేసిన సెటైర్లు బాగున్నాయి. చిరంజీవి అభిమానులు ఏం కోరుకుంటారో వాటన్నింటినీ రంగరించి దర్శకుడు మోహన్‌రాజా 'లూసిఫర్‌'ను రీమేక్‌ చేశారు. దసరా సెలవుల్లో 'గాడ్‌ఫాదర్‌' మాస్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తాడు.
 
ఈ చిత్ర బలాలను పరిశీలిస్తే, చిరంజీవి, సత్యదేవ్, దర్శకత్వం, తమన్ నేపథ్య సంగీతం అదుర్స్. బలహీనతలుగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, రొటీన్ క్లైమాక్స్‌ను చెప్పుకోవచ్చు. 
 
నటీనటులు..
చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, మురళీ శర్మ తదితరులు. 
 
సంగీతం ఎస్ఎస్ థమన్, కెమెరా నీరవ్ షా, ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాతలు రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్. దర్శకత్వం మోహన్ రాజా.
 
విడుదల తేదీ : 2022 అక్టోబరు 05, 2022