బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (11:14 IST)

రివ్యూ రిపోర్ట్: గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌.. శ్రీదేవి తనయ అదరగొట్టింది..!

Jhanvi kapoor
చిత్రం: గుంజన్‌ సక్సెనా:ది కార్గిల్‌ గర్ల్‌
నటీనటులు: జాన్వీ కపూర్‌, పంకజ్‌ త్రిపాఠి, అంగద్‌ బేడీ, వినీత్‌ కుమార్‌సింగ్‌, మానవ్‌ విజ్‌ తదితరులు
దర్శకత్వం: శరణ్‌ శర్మ
నిర్మాణం: ధర్మా ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌
సంగీతం: జాన్‌ స్టీవర్ట్‌, అమిత్‌ త్రివేది
సినిమాటోగ్రఫీ: ఆర్‌. డీ
ఎడిటింగ్‌: ఆరీఫ్‌ షేక్‌
విడుదల తేదీ: 12-08-2020(నెట్‌ఫ్లిక్స్‌)
 
తాజాగా 'గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌' చిత్రం ఓటీటీలో విడుదలైంది. అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రం బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నెటిజన్ల ముందుకు వచ్చింది. ది కార్గిల్‌ గర్ల్‌గా పేరొందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సెనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? అనేది తెలియాలంటే.. రివ్యూ చదవాల్సిందే. 
 
కథలోకి వెళ్తే.. గుంజన్‌ సక్సెనా(జాన్వీ కపూర్‌) చిన్నతనంలో విమానం నడిపే పైలట్‌ను చూసి.. తాను కూడా పైలట్‌ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమెకు పైలట్‌ శిక్షణ ఇప్పించేంత డబ్బు తన తండ్రి(పంకజ్‌ త్రిపాఠి) వద్ద లేకపోవడంతో ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ అవుతానంటుంది. అందరూ గుంజన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. తండ్రి మాత్రం ప్రోత్సహిస్తాడు. దీంతో ఎయిర్‌ఫోర్స్‌లో చేరేందుకు ప్రయత్నిస్తుంది. ఎంపికవడం కోసం తన బరువును సైతం తగ్గించుకుంటుంది. ఎట్టకేలకు ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికై శిక్షణ తీసుకొని డ్యూటీలో చేరుతుంది.

అయితే గుంజన్‌ విధులు నిర్వహించే శిబిరంలో ఉండేవాళ్లంత పురుషులే. తొలిసారి ఓ మహిళా పైలట్‌ కావడంతో ఆమెపై లింగవివక్ష చూపిస్తారు. ఈ క్రమంలో గుంజన్‌కు అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నింటిని ఎదుర్కొని గుంజన్‌ మంచి పైలట్‌గా ఎలా గుర్తింపు పొందింది? కార్గిల్‌ యుద్ధంలో ఎవరు చేయలేని సాహసాలు ఆమె ఎలా చేయగలిగింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
Jhanvi kapoor
 
ఎలా ఉందంటే..
దేశభక్తి సినిమాలు వేరు.. ప్రముఖుల బయోపిక్స్‌ వేరు. కానీ ఈ చిత్రం గుంజన్‌ సక్సెనా జీవితాన్ని ఆవిష్కరించడంతోపాటు దేశభక్తిని చాటుతుంది. ఒక బయోపిక్‌కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. గుంజన్‌ పైలట్‌ అవ్వాలని నిర్ణయించుకున్న నాటి నుంచి ఆమె ఎదుర్కొన్న ప్రతి సవాలును చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రవణ్‌ శర్మ. 
 
90వ దశకంలో లింగవివక్ష ఎలా ఉండేదో గుంజన్‌ను చూస్తే అర్థమైపోతుంది. అదే సమయంలో కూతురు ఉన్నత శిఖరాలు అందుకోవాలని కాంక్షించే తండ్రి పాత్ర కనిపిస్తుంది. మహిళా కష్టాలు, దేభక్తినే కాదు.. తండ్రికూతురు మధ్య ఉండే బంధాన్ని కూడా దర్శకుడు ఎంతో చక్కగా చూపించారు. యుద్ధ సన్నివేశాలతో ఉత్కంఠకు గురిచేశారు.
 
ప్రథమార్ధంలో గుంజన్‌ పైలట్‌ అవడం కోసం పడే కష్టాలు.. ద్వితీయార్ధంలో విధుల్లో చేరాక ఎదురయ్యే ఇబ్బందులను చూపించారు. ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధంలో గుంజన్‌ చూపించే తెగువతో ఆమె ప్రతిభ ఏంటో అందరికి అర్థమవుతోంది. హెలికాప్టర్‌ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ చిత్రంలో ఎక్కడా నాటకీయతకు, అనవసర సన్నివేశాలకు తావు ఇవ్వలేదు. అసాంతం సినిమాను ఆకట్టుకునే విధంగా తీశారు. సంభాషణలు మితంగా ఉన్నా అర్థవంతంగా ఉంటాయి.. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.
 
నటనాపరంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో జాన్వీకపూర్‌ నటనకు వందకు వంద మార్కులు వేయొచ్చు. కెరీర్‌ ప్రారంభంలోనే ఓ గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నటించే అవకాశం పొందడమే కాదు.. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. తొలి చిత్రం 'ధడక్‌'తోనే నటిగా తానెంటో నిరూపించుకున్న జాన్వీ ఈ చిత్రంతో నటనలో మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి. సంతోషం, దుఃఖం ఇలా అన్ని భావోద్వేగాలున్న గుంజన్‌ పాత్రలో జాన్వీ ఒదిగిపోయింది. 
 
ఇక ఇందులో మరో కీలకమైన గుంజన్‌ తండ్రి పాత్రలో పంకజ్‌ త్రిపాఠి మెప్పించారు. ఆయన నటనే ఈ సినిమాకు ఓ బలంగా మారింది. తొలి సినిమానే బయోపిక్‌ను ఎంచుకొని శ్రవణ్‌ శర్మ సాహసమే చేశాడు. అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా సినిమాను చిత్రీకరించాడు. పాత్రలను మలిచిన విధానం అద్భుతంగా వుంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది.
 
ప్లస్ పాయింట్స్ 
జాన్వీ కపూర్‌, పంకజ్‌త్రిపాఠి నటన. కథ
 
మైనస్ పాయింట్స్
సంగీతం.