ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (16:17 IST)

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

Karti, Arvind Swamy
Karti, Arvind Swamy
నటీనటులు : కార్తీ, అరవింద్ స్వామి, శ్రీ దివ్య, దేవదర్శిని, స్వాతి కొండే తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : మహేంద్రన్ జయరాజు, సంగీత దర్శకుడు : గోవింద్ వసంత, ఎడిటర్ : ఆర్.గోవిందరాజ్, నిర్మాతలు : జ్యోతిక సదన, సూర్య శివకుమార్, దర్శకుడు : సి. ప్రేమ్ కుమార్
 
ఈ వారం దేవర సినిమా విడుదల తర్వాత రోజు అనగా నేడు తెలుగులో థియేటర్స్ లోకి వచ్చిన చిత్రం సత్యం సుందరం, కార్తీ, అరవింద స్వామి నటించిన ఎమోషనల్ డ్రామా. మన జీవితాల్లోని ఎమోషన్స్, సబంధబాంధవ్యాలు గురించి గొప్పగా చెప్పిన కార్తీ సినిమాలో ఎలా చేశాడో చూడాలంటే సమీక్షలోకి వెల్ళాల్సిందే.
 
కథ:
గుంటూరులోని చిన్నపట్టణంలో ఉండే సత్యమూరి (అరవింద స్వామి) తండ్రి విజయ్ కుమార్ స్కూల్ టీచర్. తాతలనాటి పెద్దఇంటిలో వుంటుంటారు. సత్యమూర్తికి టీనేజ్ వచ్చాక బాబాయ్,  పెద్దనాన్నల ఆస్తిపంపకాల్లో ఆ ఇంటికి కోల్పోవాల్సి వస్తుంది. ఎంతో బాధతో తండ్రితోపాటు విశాఖపట్నం వెళతాడు. కొన్నాళ్ళకు తన బాబాయ్ కూతురు పెండ్లికి సొంతూరుకు రావాల్సి వస్తుంది. చిన్నతనంలో కలిసి పెరిగిన జ్నాపకాలతో కేవలం చెల్లెలు సంతోషం కోసం ఇష్టంలేకపోయినా ఊరు వెళతాడు. పెండ్లికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి వెంటనే తిరిగి రావాలని ప్లాన్ చేస్తాడు. కానీ అలా జరగదు. పెండ్లిలో బావ అంటూ కార్తీ ఎంట్రీ ఇచ్చి సత్యమూర్తికి  అన్ని సపర్యలు చేస్తాడు. అతనెవరలో సత్యమూర్తి తెలుసుకోవాలని ట్రై చేసినా పరిస్థితులు అనుకూలించవు. అతన్ని వదిలించుకోవాలని ట్రై చేసినా అతని ఇంటిలోనే ఆ రాత్రి మకాంచేయాల్సి వస్తుంది. 
 
ఓ దశలో అతని అతిమర్యాదలు తట్టుకోలేక తెల్లవారుతుండగా ఆ ఇంటినుంచి పారిపోయి వైజాగ్ చేరతాడు సత్యమూర్తి. ఇంటికి వచ్చినా బావా అన్న పిలుపే కళ్ళముందు కనిపిస్తుంది. ఈ విషయం తన భార్యకు చెప్పినా ఫలితం వుండదు. నాన్న బాధచూసిన కుమార్తె  ఆ ఊరికి ఫోన్ కాల్ చేస్తుంది. అప్పుడు ఏం జరిగింది? కార్తీకి సత్యమూర్తికి వున్న సంబంధం ఏమిటి?  ఊరికి వెళ్ళాక సత్యమూర్తికి ఎదురైన సంఘటనలు ఏమిటి? అనేవి సినిమా.
 
సమీక్ష:
తమిళనాడులోని ఓ గ్రామం, పట్టణంలో జరిగిన కథ ఇది. తెలుగులో డబ్బింగ్ కనుక గుంటూరు, వైజాగ్ పేర్లుగా మార్చారు. ఈ సినిమాలో కార్తీ, అరవింద స్వామి పాత్రలే కీలకం. వారి కుటుంబసభ్యులు, చెల్లెలు వివాహ వేడుకకు వెళ్ళడమే కథ. అక్కడే కథంతా దర్శకుడు నడిపిన తీరు మెచ్చుకోదగింది. మట్టివాసన కథలు, మట్టి మనుషుల జీవితాలు, అనుబంధాలు, అపోహలు, అహంకారాలు, ఆప్యాయతలు, అన్నా చెల్లెల్ల అనుబంధాలు, బావ బావమరిదిల చతుర్లు, బావనే చేసుకోవాలనుకున్నా పెద్దలమాటలతో మిస్ అయిన మరదలు.. ఇలాంటి పాత్రలు చుట్టూ కథ అల్లుకుని దర్శకుడు ఫీలయి రాస్తే ప్రేక్షకుడు కూడా ఎందుకు ఫీల్ కాడు? అనేలా ఈ సినిమాను ఆవిష్కరిచండం విశేషం.
 
ఎవరి పాత్రలు వారు ఓన్ చేసుకుని నటించారనేకంటే బిహేవ్ చేశారనడం బెటర్. తాతలనాటి ఆస్తిని పోగొట్టుకుని మూడీగా కనిపించే సత్యమూర్తికి కార్తీ పాత్రతో పటాపంచలవుతుంది. కార్తీ పాత్రలోని అమాయకత్వం, మాటకారితనం, అంతా తనవారే అనుకొనే నైజం, తన లుక్స్ తో సుందరం అనే పాత్రకి కార్తీ ప్రాణం పోసాడని చెప్పాలి. అలాగే తన పాత్ర నుంచి ఎంత ఫన్ కనిపిస్తుందో అంతకు మించిన భావోద్వేగం కూడా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటుంది.
 
కేవలం కార్తీ, అరవింద స్వామి సంభాషణలే కథను నడిపిస్తాయి. బహుశా ఈ తరహా సినిమా ఈమథ్యలో ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. చిన్నతనంనుంచి పెండ్లయ్యేవరకు కార్తీ జర్నీని చెప్పే విధానం ప్రేక్షకుడు ఎక్కడో చోట కనెక్ట్ అవుతాడు.  అయితే సెకండాఫ్ లో కాస్త సంభాషణలతో సాగే కథాగమనం కొంత విసుగు పుట్టిస్తుంది. అదీకాకుండా ఇంటిలోనే పాములు తిరుగుతుంటాయి అని కార్తీ చెప్పడంతో ఏదో జరగబోతోందనే అపోహను ప్రేక్షకుల్లో కలిగించేలా దర్శకుడు చేశాడు. క్లయిమాక్స్ వరకు కార్తీ పేరు ఏమిటో సత్యమూర్తికి తెలీయకుండా చేయడమే సినిమా. దాన్ని దర్శకుడు తీర్చిన విధానం బాగుంది.
 
గతంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో కార్తీ పలు సినిమాలు చేసినా కేవలం రెండే పాత్రలతో సినిమా అంతా చూపించడం నిజంగా మాయనే చెప్పాలి. అందుకే ఈ సినిమాను నిర్మించిన కార్తీ సోదరుడు సూర్య కథ విన్నప్పుడే.. ఇలాంటి కథలు నీకే ఎందుకు వస్తుంటాయి? అంటూ అనడంలో ఆశ్చర్యం లేదు. దర్శకుడు సి ప్రేమ్ కుమార్  96 లాంటి ఎమోషనల్ డ్రామాని ఇవ్వడంతో నచ్చి కార్తీ ఒప్పుకుని చేశాడు. పాన్ ఇండియా సినిమాల పేరుతో రక్తపాతాలు స్రుష్టించి ప్రేక్షకుల్లో భయాందోళనలు, బిపీలు కలిగించే కథలు కంటే వేయిరెట్లు బెటర్ చిత్రమిది. నటీనటులపరంగా ఎలా చేశారో సాంకేతికపరంగా వారి వారి పనులు బాగా చేశారనే చెప్పాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా లాగ్ చేయడమే అవుతుంది. కుటుంబంతో హాయిగా కూర్చుని చూడతగ్గ సినిమా ఇది.
రేటింగ్ : 3/5