సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (17:57 IST)

సమ్మతమే మూవీ రివ్యూ రిపోర్ట్.. రేటింగ్ ఎంతో తెలుసా?

Sammathame
Sammathame
సినిమా: సమ్మతమే
దర్శకుడు: గోపినాథ్ రెడ్డి
నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, 'వైరల్లీ' రవితేజ, 'చమ్మక్' చంద్ర తదితరులు
నిర్మాత: కంకణాల ప్రవీణ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపినాథ్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మాసం
సంగీతం: శేఖర్ చంద్ర
విడుదల తేదీ: జూన్ 24, 2022
 
'రాజావారు రాణిగారు'తో హీరోగా పరిచయమైన యువకుడు కిరణ్ అబ్బవరం. తొలి సినిమాతో విజయం అందుకున్నారు. ఆ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన నటించిన తాజా సినిమా 'సమ్మతమే'. ఇందులో తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్. ప్రచార చిత్రాలు, శేఖర్ చంద్ర సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
 
సినిమా కథేంటంటే? పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను పేమించాలని అనుకునే యువకుడు కృష్ణ (కిరణ్ అబ్బవరం). పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి గతంలో లవ్ ఎఫైర్స్ వంటివి ఉండకూడదని అనుకుంటాడు. తనకు కాబోయే భార్య తనతో అసలు అబద్ధం చెప్పకూడదని కోరుకుంటాడు. ఆమెను ఇంకో అబ్బాయి తాకినా సహించలేని వ్యక్తి. 
 
తండ్రి (గోపరాజు రమణ) సంబంధం చూడటంతో శాన్వి (చాందిని చౌదరి) వాళ్ళింటికి పెళ్లి చూపులకు వెళతాడు. అక్కడ శాన్వికి కాలేజీలో ఎఫైర్ ఉందని తెలియడంతో కోపంగా వచ్చేస్తాడు. ఆ తర్వాత మరో 20 పెళ్లి చూపులకు వెళతాడు. 
 
ఏ అమ్మాయిని చూసినా... శాన్విలా అనిపించడంతో మళ్లీ ఆ అమ్మాయి దగ్గరకు వెళతాడు. శాన్వి మోడ్రన్ యువతి. కృష్ణ కోరుకున్న లక్షణాలు ఆ అమ్మాయిలో లేవు. దాంతో ఆమెకు ఆంక్షలు విధించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న తర్వాత... నిశ్చితార్థం వరకూ వచ్చాక... శాన్వి వద్దని కృష్ణ ఎందుకు అన్నాడు? కారణం ఏమిటి? చివరకు ఈ ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది సినిమాలో చూడాలి. 
Sammathame
Sammathame
 
విశ్లేషణ: మన జీవితంలోకి వచ్చే వ్యక్తులను యథావిథిగా స్వీకరించాలని చెప్పే చిత్రమిది. జీవిత భాగస్వామి మనకు నచ్చినట్టు ఉండాలని, మనం చెప్పింది వినాలని, చెప్పిందే చేయాలని కొందరు కోరుకుంటారు. అయితే... ఆ కోరికతో ఎదుటి వ్యక్తిపై అజమాయిషీ చేయడం కరెక్ట్ కాదని చెబుతుందీ 'సమ్మతమే'. ఈ తరహా కథాంశాలతో గతంలో కొన్ని చిత్రాలు వచ్చాయి.  
 
శేఖర్ చంద్ర స్వరాలు 'సమ్మతమే'. నేపథ్య సంగీతమూ 'సమ్మతమే'. ప్రారంభం నుంచి ముగింపు వరకూ చాలా సన్నివేశాల్లో సంగీతం వీనుల విందుగా ఉంది. తెరపై సన్నివేశాలు నిజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేశారు శేఖర్ చంద్ర. ఆ కథకు, సన్నివేశాలకు ఆయన సంగీతం బాగా సూట్ అయ్యింది.కానీ కథలో కాన్‌ఫ్లిక్ట్‌ విషయంలో కొంత గందరగోళం ఉంది. సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ ట్రాక్ కథను సాగదీసింది.  
 
నటీనటులు ఎలా చేశారు?
కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడిలా కనిపించారు. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టు సెటిల్డ్‌గా నటించారు. డైలాగ్ డెలివరీ, టైమింగ్ బావున్నాయి. క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సీన్‌లో పర్వాలేదు. చాందిని చౌదరి నటించినట్టు లేదు. పాత్రలో జీవించినట్టు చేశారు.  
 
చివరగా చెప్పేది ఏంటంటే?: ఈ కాలంలో అమ్మాయిల డ్రస్సింగ్, లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళను జడ్జ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. అటువంటి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య ప్రేమ పుడితే... అనేది సినిమా కథాంశం. పాటలు బావున్నాయి. ఫస్టాఫ్ బావుంది. సెకండాఫ్ కొంత సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది.
 
మళ్ళీ క్లైమాక్స్ ఓకే. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్ళండి. కాసేపు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. మొత్తానికి సమ్మతమే రొమాంటిక్ ఎంటర్‌టైనర్.
 
హైలైట్స్:
కిరణ్ అబ్బవరం నటన
క్లైమాక్స్ 
 
లోపం:
బోరింగ్ సీన్స్
 
రేటింగ్: 2.5/5