శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:02 IST)

ఏపీ ప్రజలు అప్పుడే జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా వున్నారా? విశాఖ వైసీపి ఎమ్మెల్యేలు ఎందుకలా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుడే జగన్ మోహన్ రెడ్డి పాలనపై పెదవి విరుస్తున్నారా? ఎమ్మెల్యేలు, మంత్రులు జనంలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారా? అసలేం జరుగుతోంది. విశాఖలో బుధవారం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... సమస్యలు పరిష్కరించండి, ఈ పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లాలంటే భయంగా ఉందని అన్నారు.
 
విశాఖలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా మొర పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, బి.మాధవి, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాల నాయుడు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సమస్యలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. 
 
ముఖ్యంగా ఇసుక కొరత వల్ల చాలామంది ఉపాధి కార్మికలకు పనులు దొరక్క అల్లాడిపోతున్నారనీ, గ్రామాలకు వెళ్తుంటే ప్రజల నుంచి వస్తున్న నిరసనలు ఇబ్బందిగా వున్నాయంటూ వారు చెప్పారు. ఇదేదో విశాఖపట్టణం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే చెపుతున్నారనుకుంటే పొరబడినట్లే. చాలాచోట్ల ఇదే అభిప్రాయం వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపధ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి అడుగులు వేస్తారో... స్వంత ఎమ్మెల్యేలే ఇలా చెపుతుంటే ఇక పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.