శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (10:27 IST)

శివసేనకు మద్దతు : తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్

మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఈ అంశంపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపింది. మంగళవారం మరోమారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. 
 
మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించి నేటి సాయంత్రం వరకు గడువిచ్చారు. దీంతో మిత్రపక్షమైన ఎన్సీపీ నేతలతో నేడు సమావేశమై తాజా పరిణామాలను చర్చించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మద్దతు విషయమై ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నేతలు పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటో స్పష్టమైన తర్వాతే ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.
 
ఇదిలావుంటే, తమకు మద్దతు ఇచ్చేందుకు ముందుకురాని కాంగ్రెస్‌కు శివసేన ఎందుకు మద్దతు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు లేవని తెగేసి చెబుతున్నారు. సాయంత్రం వరకు వేచి చూసి ఆ తర్వాత రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.