శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:00 IST)

తెలంగాణ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఫలితంగా గురువారం ఉదయం ఆయన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8.30

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఫలితంగా గురువారం ఉదయం ఆయన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని రేవంత్ నివాసానికి ఐటీ బ‌‌ృందం చేరుకుని ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం.
 
ఆ సమయంలో రేవంత్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో.. అక్కడ ఉన్న సిబ్బందికి నోటీసులు ఇచ్చి దాడులు చేస్తున్నట్టు సమాచారం. వారి సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకుని స్విచ్చాఫ్ చేసి ఈ సోదాలకు దిగారు. ఇకపోతే, కొడంగల్‌లో ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రస్తుతం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఈ సోదాల్లో ఆస్తి పత్రాలు, భూముల డాక్యుమెంట్స్, కంపెనీల లావాదేవీలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులైన 15మంది ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన భూపాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. లెక్కా పత్రం లేని అక్రమ ఆర్థిక లావాదేవీలపై వారు ఫోకస్ చేసినట్టు సమాచారం.
 
కాగా, ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతుండటం సంచలనం రేపుతోంది. ఇటీవలే తెరాస నేత, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తనపై ఐటీ దాడులు జరుగుతాయన్న విషయాన్ని రేవంత్ ముందుగానే ఊహించారు. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో తనను అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఆయన ఊహించినట్టుగానే ఇపుడు ఐటీ సోదాలు జరిగాయి.