బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (17:00 IST)

పెట్రోల్ బంకులో తండ్రి-కూతురు దిగిన ఫొటో వైరల్

అంకితభావంతో కృషి చేస్తే విజయం దానంతట అదే తలుపు తడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ శ్రీకాంత్ మాదవ్ వైద్య. పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురు ఆర్య రాజగోపాలన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో సీటు సంపాదించిన ఈ యువతిని అభినందించారు. కంపెనీలో ప్రతి ఒక్కరూ ఆమె కృషికి, అంకితభావానికి గర్వపడుతున్నారని తెలిపారు.
 
వివరాల్లోకి వెళ్తే.. ఆర్య రాజగోపాలన్ తండ్రి రెండు దశాబ్దాలుగా కేరళలో పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి బజాజ్ మోటార్స్ లో వర్కర్ గా పనిచేస్తున్నారు. ఎన్నో ఆర్థిక సమస్యల నడుమ తమ కూతురును పెద్ద చదువులు చదివించాలని వారు భావించారు. ఇందుకోసం ఎంతగానో శ్రమించారు. తండ్రిది చిన్న ఉద్యోగమే అయినప్పటికీ ఆర్య చదువుల్లో ఎప్పుడూ ముందుండేది. ఎన్ఐటీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్న ఆమె.. ఎంటెక్‌ను ఐఐటీ కాన్పూర్ నుంచి పూర్తి చేయనుంది. అక్కడ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సు చదవనుంది.
 
 
పెట్రోల్ బంకులో తండ్రి-కూతురు దిగిన ఫొటోను కూడా ఐఓసీ చైర్మన్ షేర్ చేశారు. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆర్య రాజగోపాలన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల ఆ తండ్రి కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆర్య విజయాన్ని కొనియాడుతున్నారు.