బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 అక్టోబరు 2023 (13:05 IST)

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర: 15 రోజుల్లో రూ. 70 నుంచి రూ.80కి చేరిన వైనం

onions
ఆమధ్య టమోటాలు కిలో రూ. 200కి చేరి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఇప్పుడు మరోసారి ఉల్లిపాయలు ధరలకు కూడా రెక్కలొచ్చాయి. 15 రోజుల క్రితం వరకూ కేవలం 30 రూపాయలున్న కిలో ఉల్లి ధర ఇప్పుడు రూ. 70 నుంచి రూ. 80కి చేరింది. నాణ్యత లేని ఉల్లి కిలో రూ.50కి విక్రయిస్తుండగా, మధ్యస్థ, నాణ్యమైన ఉల్లి రూ.60, రూ.70కి లభిస్తున్నాయి. కొత్త ఖరీఫ్ పంట మార్కెట్‌లోకి వచ్చే డిసెంబర్ వరకు ఉల్లి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ప్రకారం చూస్తే కిలో ఉల్లి ధర రూ. 120 నుంచి రూ. 150కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
 
సాధారణంగా అక్టోబరు-నవంబర్‌లో పండే ఖరీఫ్‌ సీజన్‌లో పండే ఉల్లి ఈ ఏడాది సెప్టెంబర్‌ మధ్యలో రావడం ప్రారంభమైంది. మహారాష్ట్రలో పంట విస్తీర్ణం 36 శాతం మేరకు తగ్గిపోయి 58,000 హెక్టార్లకు తగ్గింది. ఈ కారణంగానే ధరలు పెరగడం ప్రారంభించాయి. గత రెండేళ్లుగా రైతులు నష్టపోవడంతో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ పంట సీజన్లో ఉల్లిని విత్తడం తక్కువైందనీ, మరోవైపు ఈ రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉల్లి ఉత్పత్తిని మరింత తగ్గించింది.