మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (15:01 IST)

గరిక లేనిదే వినాయక పూజ చేయరు.. ఎందుకని?

garika vinayaka
వినాయకుడికి గరిక అంటే మహాప్రీతిపాత్రం. ఆయనకు పూజ చేయాలంటే ఖచ్చితంగా గరిక ఉండాల్సిందే. ముక్కోటి దేవతల్లో ఒక్క బొజ్జ గణపయ్యకు మాత్రం గరిక అంటే ప్రీతపాత్రమో ఓసారి తెలుసుకుందాం. 
 
గరిక అంటే ఎంతో ఇష్టం అనడానికి ఓ కథ ఉంది. పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టుకతోనే అగ్నితత్వాన్ని కలిగి ఉండటంతో ఎదురుగా ఉన్న దాన్ని భస్మం చేసేవాడు. దాంతో ముల్లోకాలు అల్లకల్లోలంగా మారాయి. ఆ సమయంలో వినాయకుడు అనలాసురుడి అంతం చూసేందుకు సిద్ధపడ్డాడు. తన తండ్రి మాదిరిగానే ఆ రాక్షసుడిని వినాయకుడు గుటుక్కున మింగేశాడు. 
 
వినాయకుని ఉదర భాగానికి చేరుకున్న అనలాసురుడు అక్కడ విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడు. వినాయకుడి ఉదరంలో తాపం తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి గరికతోనే తనకు ఉపశమనం కలుగుతుందని గణేశుడు భావించి, తనను గరికతో కప్పమని దేవతలను కోరాడు. 
 
దేవతలందరూ 21 గరికలను తీసుకొచ్చి వినాయకుడి శరీరాన్ని కప్పారు. గరికలోని ఔషధ గుణాల కారణంగా వినాయకుడి తాపం తగ్గింది. అప్పటి నుంచి వినాయకుడికి గరిక అత్యంత ప్రీతిపాత్రమైంది. ఆయనకిష్టమైన గరితో చవితి రోజు పూజించడం మొదలైంది. ఇప్పటికీ గరికలేనిదే వినాయక చవితి పూజ సంపూర్ణం కాదు.