ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 26 నవంబరు 2020 (21:54 IST)

విజయనగరం - జట్టు ఆశ్రమం: గిరిజన ఆచారంతో అనాథలైన పిల్లలను చేరదీస్తున్న 'జట్టు' ఎలా పుట్టింది?

భర్త చనిపోతే భార్య రెండో వివాహాం చేసుకోవచ్చు. కానీ, వారికి పుట్టిన పిల్లలను మాత్రం తమతో తీసుకెళ్లకూడదు. గ్రామంలోనే వదిలేయాలి. కాలం మారుతున్నా ఈ ఆచారాన్ని మాత్రం వీడటం లేదు కొన్ని గిరిజన తెగలు. పెద్దల మాట ఎలా ఉన్నా ఈ ఆచారం మాత్రం ఆయా పిల్లల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. అయితే ఈ శాపాన్నే వరంగా మారుస్తోంది 'జట్టు ఆశ్రమం'.

 
గిరిజన తెగల సంస్కృతీ... సంప్రదాయాలూ... భిన్నంగా ఉంటాయి. లాభనష్టాలతో పనిలేకుండా కొన్ని తరాలుగా ఇవి కొనసాగుతూనే వస్తున్నాయి. వీటిలో కొన్ని కట్టుబాట్లు మాత్రం ఆ తెగవారికే శాపంగా మారుతున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గిరిజన గ్రామాల్లోని అనేకమంది పిల్లలను అనాథలుగా మార్చేస్తున్న ఈ ఆచారం కూడా ఆ కోవకు చెందిందే.

 
విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, పాచిపెంట, జియమ్మవలస, కురుపాం, కొమరాడ మండల్లాల్లో గిరిజన తెగలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరిలో జాతవులు, కొండదొర, సవర, గడబ వంటి తెగలు ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. సవర, గడబ లాంటి తెగలు తమ సొంత మాండలికంలోనే మాట్లాడుకుంటారు. వీరిలో భర్త చనిపోయినా, విడిచిపెట్టినా ఆ భార్యకు తిరిగి వివాహం చేయడం వీరి సంప్రదాయం. భర్తతో కలిసి ఉండటం ఇష్టంలేని వారికి విడాకులు తీసుకునే వెసులుబాటు కూడా ఈ తెగల్లో ఉంటుంది.

 
ఆచారం... అనాథలుగా మారడానికి కారణం
ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)లోని కొన్ని గిరిజన తెగల్లో మహిళలు భర్త చనిపోతే...అతడి అన్న లేదా తమ్ముడు ఉంటే వివాహం చేసుకోవాలి. వారిని వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోయినా...లేదా భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేకపోయినా... మరో ప్రాంతానికి చెందిన వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. అయితే, అప్పటికే ఆమెకు పిల్లలు పుడితే వారిని ఆ గ్రామంలోనే వదిలి వెళ్లిపోవాలి. ఆమెతో తీసుకుని వెళ్లకూడదు. దీంతో తల్లీ తండ్రీ లేక ఆ పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. ఆ పిల్లల ఆలనాపాలనా వారి కుటుంబ సభ్యులు లేదా స్థానిక గిరిజనులే చూసుకోవాలి.

 
ప్రస్తుతం కొన్ని గిరిజన గ్రామాలు ఆధునికతను అందిపుచ్చుకుంటున్నా మరికొన్ని మాత్రం మార్పునకు అంతగా ఇష్టపడటం లేదు. అలాంటివే... ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గుమ్మలక్ష్మీపురంలోని మేదరగండ, కురుపాంలోని దురిబిలి గ్రామాలు. ఆ ప్రాంతాల్లో బీబీసీ పర్యటించి... వారి ఆచార వ్యవహారాలు, వాటి పరిణామాల మీద కొందరు గిరిజనులతో మాట్లాడింది.

 
ఒక భర్త వదిలేశాడు... మరొక భర్త చనిపోయాడు...
"నా భర్త వదిలేశాడు. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. నేను రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ పిల్లలను మా గ్రామంలోనే విడిచిపెట్టాల్సి వచ్చింది. పెళ్లయిన తొలి రోజుల్లో నా పిల్లలను అప్పుడప్పుడు వెళ్లి చూసుకునేదాన్ని. మళ్లీ మగ్గురు పిల్లలు పుట్టడంతో అక్కడికి వెళ్లడం సాధ్యమయ్యేది కాదు. వారిలో ఒకడు చనిపోయాడు కూడా. అయినా మా తాతలు, తండ్రుల నుంచి వస్తుంది కాబట్టి ఈ ఆచారాన్ని మేం తప్పుపట్టలేము"అని పేరు చెప్పడానికి ఇష్టపడని మేదరగండ, దురిబిలికి చెందిన ఇద్దరు మహిళలు బీబీసీకి చెప్పారు.
 
(వీరు సవర మాండలికంలో మాట్లాడారు. దాన్ని దురిబిలి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెహనరావు తెలుగులోకి అనువదించారు.)
 
స్త్రీని భూదేవిగా కొలుస్తారు...స్వేచ్చకు అడ్డుచెప్పరు
"గిరిజన సమూహాల్లో స్వేచ్ఛ సమాజ పోకడలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇప్పటికి చాలా తెగల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఏవోబీలో ఉండే చాలా గిరిజన తెగలు స్త్రీ స్వేచ్ఛకు అడ్డు చెప్పరు. పైగా వీరు స్త్రీని భూమితో పోలుస్తారు. భూమి ఏదైనా ఇవ్వడమే కానీ... తీసుకోదు. అలాగే ఇక్కడ స్త్రీ కూడా ఏదీ తీసుకోకూడదు. తనకు ఇష్టం లేకపోయినా...లేదా భర్త చనిపోయిన సందర్భాల్లో ఆమె స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు. కానీ, పిల్లల్ని మాత్రం తీసుకెళ్ల కూడదు"అని ఆంధ్ర విశ్వవిద్యాలయం, రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ బీబీసీకు వివరించారు.

 
"ఇటువంటి ఆచారాల్ని కచ్చితంగా పాటిస్తున్న గిరిజనం... దాని తదనంతర పరిణామాలను పెద్దగా పట్టించుకోరు. మరో పెళ్లి చేసుకునే స్త్రీ... పిల్లలను వదిలి వెళ్లాల్సిందే అనే నియమం వలన అనేక మంది పిల్లలు అనాథలైపోతున్నారు" అని చెప్పారు.

 
ఉద్యోగం వదిలి... పిల్లల 'జట్టు' కట్టి
ఇలాంటి గిరిజన పిల్లల జీవితాలను చూసి చలించిపోయారు డి. పారినాయుడు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పారినాయుడు... సంప్రదాయాల కారణంగా అనాథలుగా మారిపోతున్న గిరిజన పిల్లల కోసం ఏదైనా చేయాలని భావించారు. దాని కోసం ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి... 'జట్టు' పేరుతో ఒక ట్రస్టును ప్రారంభించారు.

 
"చిన్నప్పటి నుంచీ సేవ చేయాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే ఈ గిరిజన బాలల కష్టాలను చూసిన తర్వాత స్థిమితంగా ఉండలేకపోయాను. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1998లో వారి కోసం జట్టు పేరుతో ఒక ట్రస్టును ప్రారంభించాను. ప్రస్తుతం దీన్ని 'జట్టు ఆశ్రమం' అని పిలుస్తున్నారు. గిరిజన అనాథ పిల్లల కోసం ప్రారంభించిన ఇందులో ఇప్పుడు మైదాన ప్రాంత అనాథలు కూడా ఆశ్రయం పొందుతున్నారు. స్థానిక ప్రజలు ఇచ్చే విరాళాలే ఈ ట్రస్టు నిర్వహణకు అధిక శాతం ఉపయోగపడుతున్నాయి"అని బీబీసీతో చెప్పారు.

 
గ్రూప్-1 ఉద్యోగం వదిలి...అనాథలకు అమ్మగా మారి...
హైదరాబాద్‌లోని వెలుగు ప్రాజెక్ట్‌లో చైల్డ్ లేబర్ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న వి. పద్మజ పనిలో భాగంగానే జట్టు ఆశ్రమం గురించి తెలుసుకున్నారు. ఈ ఆశ్రమం చేస్తున్న సేవ నచ్చి పార్వతీపురం వచ్చి ఆశ్రమాన్ని సందర్శించారు. దీనికి తనవంతు సాహాయాన్ని అందించాలను కున్నారు. 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆశ్రమంలోని పిల్లలకు సేవ చేయడానికి ముందుకొచ్చారు.

 
ఇప్పుడు 'జట్టు ట్రస్టు' నిర్వహణ అంతా పద్మజే చూస్తున్నారు. ఈమెను... ఆశ్రమంలోని పిల్లలంతా 'అమ్మ' అని పిలుస్తారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయాలని మా అమ్మమ్మ చెప్పేవారని, చదువు పూర్తయ్యాక గ్రూప్-1 ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినా అందులో అంత సంతృప్తి కనిపించలేదని గుర్తు చేసుకున్నారు పద్మజ.

 
"ఆ సమయంలోనే విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో ఉన్న జట్టు ఆశ్రమాన్ని సందర్శించాను. అనాథ బాలలూ, పేదరికం కారణంగా చదువుకు దూరమైనవాళ్ల కోసం ఏర్పాటయిన ఆశ్రమం అది. 2004లో ఉద్యోగాన్ని వదిలేసి... ఆశ్రమ నిర్వహణలో భాగమయ్యాను" అని ఆమె చెప్పారు.

 
చదువుతోపాటు అన్నింటిలోనూ శిక్షణ
"ఇక్కడికి వచ్చే పిల్లలకి...వారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. జట్టు ఆశ్రమమే వీరికి అన్ని. కేవలం అనాథ గిరిజనులను చేరదీసి ఆశ్రయం కల్పించడమే కాకుండా... వారికి చదువుతోపాటు సంప్రదాయ కళలలోనూ శిక్షణ ఇస్తాం. కూచిపూడి, భరతనాట్యం, కర్రసాము, యోగా, కత్తిసాము లాంటి కళలనూ నేర్పిస్తాం. అంతేకాదు... సేంద్రీయ వ్యవసాయ పనుల్లో తర్ఫీదు ఇస్తాం. వీటిలో శిక్షణ కోసం చుట్టుపక్కల ఊళ్ళ నుంచీ అనేక మంది ఆశ్రమానికి వస్తారు. ఇలా ఇప్పటి వరకూ ఆశ్రమంలోని పిల్లలతో కలిపి 1200 మందికి పైగా శిక్షణ పొందారు. పుట్టింటి మాదిరిగానే ఇక్కడి పిల్లల పెళ్లి, పురుడు బాధ్యతలు ఆశ్రమమే చూసుకుంటుంది" అని పద్మజ చెప్పారు.

 
కత్తి తిప్పుతాం...వీణ వాయిస్తాం...వ్యవసాయం కూడా చేస్తాం
ఇక్కడి పిల్లలకు ఆశ్రమం అన్నింట్లోనూ శిక్షణ ఇస్తుంది. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే వీరంతా... ఆశ్రమంలో అనేక కళలలో శిక్షణ పొందుతారు. కత్తి, కర్రసాము వంటి ఆత్మ రక్షణ విద్యలతో పాటు సంగీతంలోనూ శిక్షణ ఇస్తారు. అలాగే సేంద్రీయ వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ కూడా ప్రతిరోజు చేయిస్తారు. వ్యర్థాలతో టాయిలెట్ క్లీనింగ్, ఆశ్రమంలో పండే గోంగూర, మామిడి వంటి వాటి నుంచి పచ్చళ్లు తయారు చేస్తారు. నేటి ఆధునీక సమాజానికి కావలసిన అన్ని మెళకువలను ఇక్కడ నేర్పిస్తారు.

 
"చిన్నతనం నుంచి ఈ ఆశ్రమంలోనే పెరిగాను. మా అమ్మనాన్న ఎవరో నాకు తెలియదు. పద్మజ మేడమే మాకు అమ్మ. ఈ ఆశ్రమమే మా ఇల్లు. ఆటపాటలు, చదువులు అన్ని ఇక్కడే. ఆత్మరక్షణ కోసం కర్రసాము నేర్చుకున్నాను. అలాగే కత్తిసాము కూడా తెలుసు. ఇక్కడ ఏదైనా ఉచితంగానే నేర్పిస్తారు"అని కర్రసాములో శిక్షణ పొందిన సమీర చెప్పారు.

 
"ఈ ఆశ్రమంలోనే పెరిగాను. ఎన్నో విద్యలు ఇక్కడ నేర్చుకున్నాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం నేర్చుకోవడం వలన మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. దీని వలన నాకు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది"అని పదో తరగతి విద్యార్థిని సుశీల చెప్పారు.

 
"Know your food పేరుతో ఇక్కడ రకరకాలైన పంటలను పండిస్తున్నాం. రసాయన ఎరువులతో కాకుండా...సేంద్రీయ ఎరువులతో ఆరోగ్యకరమైన పంటలను ఎలా పండించాలో నేర్చుకున్నాం. ఇక్కడికి ఎవరైనా వచ్చినా...లేదా మేం బయటకి వెళ్లి కూడా మేం వ్యవసాయ మెలకువలు నేర్పిస్తున్నాం. మా ఆశ్రమంలో రోజూ సేంద్రీయ వ్యవసాయంపై ఏదో ఒక పరిశోధన చేస్తూనే ఉంటాం"అని డిగ్రీ పూర్తి చేసిన మధు చెప్పారు.

 
"నేను చిన్నతనం నుంచీ ఇక్కడే ఉంటున్నాను. ఇంటర్ వరకు చదువుకున్నాను. ఆ తరువాత మంచి సంబంధం రావడంతో నాకు ఆశ్రమమే పెళ్లి చేసింది. ఇప్పుడు నాకు ఐదేళ్ల పాప ఉంది. మళ్లీ నేను గర్భవతిని. అందుకే మా పుట్టిల్లైన జట్టు ఆశ్రమానికి పురుటికి వచ్చాను"అని గర్భిణీ అరుణ చెప్పారు.

 
"ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి వారికి ఎలాంటి లోటు లేకుండా చూస్తాం. వారికి ఏ అంశంలో ఆసక్తి ఉంటే అందులో శిక్షణ ఇప్పిస్తాం. దీని కోసం ఎందరో స్వచ్ఛందంగా వచ్చి శిక్షణ ఇస్తారు. ఉద్యోగం, ఉపాధి, పెళ్లి బాధ్యతలు కూడా మేమే తీసుకుంటాం. మేమంతా ఒక జట్టు...మాది ఒక ఉమ్మడి కటుంబం" అని జట్టు ఆశ్రమ సభ్యులు, రిటైర్డ్ టీచర్ అల్లువాడ కైలాసం తెలిపారు.