గోళ్ళ అందం కోసం కొన్ని చిట్కాలు.. మేనిక్యూర్, పెడిక్యూర్ తప్పనిసరి!
అందంగా, మెరిసిపోయే విధంగా గోళ్ళు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. మరీ ముఖ్యంగా యువతులు ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటారు. ఇందుకోసం ఎంతో సమయం వృధా చేస్తుంటారు. వాస్తవానికి సమయం కంటే.. కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చూడముచ్చటైన గోళ్లను చూడొచ్చని వారు పలువురు బ్యూటీషియన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి చిట్కాల్లో ప్రధానంగా గోళ్లను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరుచుకోవాలని సూచన చేస్తున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి 3, 4 నిమిషాల వరకు అందులో ఉంచినట్టుయితే గోళ్ల తెల్లగా మిరిమిట్లు గొలుపుతాయని చెపుతున్నారు.
అలాగే, గోళ్ల దగ్గర కొద్దిగా మసాజ్ చేయడం ఎంతో అవసరమని చెపుతున్నారు. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెపుతున్నారు. గోళ్ళకు మంచి ఆకారాన్ని ఇవ్వటానికి ఫైలర్‌ను వాడటం మంచిదంటున్నారు.
ఎప్పుడూ నెయిల్‌పాలిష్‌నే వాడకూడదని సెలవిస్తున్నారు. తరచుగా నెయిల్ పాలిష్, రిమూవర్ ఉపయోగిస్తూ ఉంటే గోళ్ళ రంగు మారి పసుపు రంగులోకి మారే అవకాశం లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల గోళ్ళకు పాలిష్ నుంచి కొంతకాలం వరకు విశ్రాంతి నివ్వాలని సలహా ఇస్తున్నారు.
ప్రతిరోజూ డ్రెస్‌కు తగినట్టుగా నెయిల్‌పాలిష్ వేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఇందుకోసం ముందు రోజు పెట్టుకున్న నెయిల్ పాలిష్‌ను తీసివేయటానికి ఎసిటోన్ ద్రావకాన్ని వాడుతుంటారు. ఇలాంటి ద్రావకం వాడటం మంచిది కాదంటున్నారు.
సాధ్యమైనంతవరకు గోళ్ళను ఎక్కువ పొడవుగా పెంచకూడదంటున్నారు. పొడుగ్గా ఉండే వాటి మీద ఒత్తిడి పెరిగితే వెంటనే విరిగిపోతాయని చెపుతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మేనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలంటున్నారు. దీంతో కాళ్ళు, చేతులు చర్మం మెరిసిపోతూ, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయని బ్యూటీషియన్లు చెపుతున్నారు.