గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (17:03 IST)

ఆంధ్రా యూనివర్శిటీల్లో 3,282 టీచింగ్ పోస్టులక భర్తీకి నోటిఫికేషన్

andhrapradesh logo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, మొత్తం 3,282 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేసింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్ లాగ్, 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు వేటికవే ప్రకటనలు విడుదల చేశాయి. వీటిలో ప్రొఫెసర్ పోస్టులు 418, అసోసియేట్ ప్రొఫెసర్లు 801, ట్రిపుల్స్ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి సహాయ ఆచార్యుల పోస్టులు 2,001 ఉన్నాయి. 
 
ఈ పోస్టుల కోసం దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. 
 
స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. పోస్టుల భర్తీకి 2017, 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించాయి.
 
అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుకు ఒక్కో దరఖాస్తుకు రూ.3 వేలు దరఖాస్తు ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయాలంటే రూ.54 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రెండు, మూడు సబ్జెక్టులకు అర్హత ఉన్న వ్యక్తులైతే దరఖాస్తులకే రూ.లక్ష చెల్లించాల్సి వస్తుంది. సహాయ ఆచార్యుల పోస్టుకు సంబంధించి ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.  2వేలు చెల్లించాల్సి ఉంటుంది.
 
ప్రతి తప్పునకు ఒక మైనస్ మార్కు
స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌‍లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.