ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (22:26 IST)

కరోనా విజృంభణ.. ఏపీలో 147 కేసులు.. ఆ రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ!?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. గత 24గంటల్లో ఏపీలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా కర్నూల్‌లో ఒకరు మరణించారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,92,008 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 7,185 కి చేరింది.
 
రోజురోజుకు కరోనా కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఒకే రోజు భారీగా కరోనా కేసులు పెరిగాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర లోనే సగం నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 16,620 కొత్త కేసులు నమోదయ్యాయి. 40 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,14,413కి చేరుకుంది. ఇప్పటి వరకు 52,861 మంది చనిపోయారు.
 
ఇకపోతే.. కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తిరిగి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ఇప్పటికే పలు మార్గదర్శకాలను విడుదల చేసి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం.. నేరుగా రాష్ట్రాల పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
 
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు తగిన చర్యలను అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎంలతో చర్చించనున్నారు.