అనుష్కకు టీకప్పులు అందిస్తున్న సెలక్టర్లు (video)
భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ టీమిండియా సెలక్టర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీనటి అనుష్క శర్మకు టీకప్పులు అందించడమే సెలక్టర్ల పని అంటూ విమర్శించారు. ఇది మిక్కీ మౌస్ సెలక్షన్ కమిటీ అని సెటైర్ వేశాడు. సెలెక్షన్ కమిటీపై కోహ్లీ ప్రభావం ఎక్కువగా ఉందని ఫరూక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసలు ఈ సెలెక్టర్లను ఎలా ఎంపిక చేస్తున్నారో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. సెలక్టర్లపై కోహ్లీ ప్రభావం మంచిది కాదని చెప్పారు. పది నుంచి 12 టెస్టు మ్యాచుల కంటే ఎక్కువ వీరెవరూ ఆడలేదని వెల్లడించారు.
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో ఒక సెలెక్టర్‌ను తాను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయానని ఫరూక్ ఇంజినీర్ తెలిపారు. ఇండియా బ్లేజర్ వేసుకుని అతను ఉండటంతో.. ఎవరని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇండియా బ్లేజర్ వేసుకున్నవారంతా సెలక్టర్లు అని చెప్పడంపై ఫరూక్ మండిపడ్డారు. సెలెక్షన్ కమిటీలో దిలీప్ వెంగ్ సర్కార్ ఉండాలని తాను భావిస్తున్నానని ఫరూక్ ఇంజినీర్ చెప్పారు. వెంగ్ సర్కార్ లాంటి వ్యక్తులు కమిటీలో వుండాలని చెప్పుకొచ్చారు.