బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (12:35 IST)

సుప్రీం ఆమోదముద్ర వేస్తే బీసీసీఐ చీఫ్‌గా ఐదేళ్ళపాటు గంగూలీనే!

లోథా కమిటీ సంస్కరణ మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసినపక్షంలో వచ్చే ఐదేళ్లపాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్‌గా సౌరవ్ గంగూలీనే కొనసాగనున్నారు. 
 
సాధారణంగా లోథా కమిటీ సంస్కరణల ప్రకారం భారత క్రికెట్ వ్యవస్థల్లో వరుసగా ఆరేళ్లపాటు పదవుల్లో ఉన్న వ్యక్తి మరోసారి పదవి చేపట్టాలంటే మూడేళ్ల విరామం తప్పనిసరి. కానీ, మాజీ కెప్టెన్ గంగూలీ 2015 నుంచి బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగారు. 
 
ఆయన ఆ పదవిలో ఉండగానే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లోథా కమిటీ సంస్కరణల ప్రకారం గంగూలీ యేడాది కంటే తక్కువ సమయంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి.
 
అయితే, బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టిన వెంటనే లోథా సంస్కరణలను మార్చడంపై దృష్టి పెట్టారు. ఇదే అంశంపై ఆయన సర్వసభ్య సమావేశం నిర్వహించి లోథా కమిటీ సంస్కరణల మార్పుపై సభ్యుల అభిప్రాయాన్ని సేకరించారు. 
 
వారందరూ లోథా కమిటీ సంస్కరణలకు ఆమోదం తెలుపుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మాన ప్రతిని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై అపెక్స్ కోర్టు ఆమోదముద్ర వేసిన పక్షంలో వచ్చే ఐదేళ్ళ పాటు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.