శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2023 (14:20 IST)

మొతేరాలో ఆఖరి పోరాటం - టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్ : ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రధాని మోడీ

ind vs aus
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, మొతేరా స్టేడియంలో ఆఖరి పోరాటం మొదలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేపట్టనుంది. టాస్ వేసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఒకవేళ తాము గెలిచివుంటే మొదట బ్యాటింగే తీసుకునేవాళ్లమని చెప్పారు. ఇపుడు టాస్ ఓడినా రోహిత్ కోరుకున్నదే దక్కినట్టయింది. ఫైనల్ కోసం తన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రోహిత్ చెప్పగా, అటు ఆస్ట్రేలియా జట్టులోనూ ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇక్కడ విచిత్రమేమిటంటే గత 2003లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఇపుడు 2023లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరి ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 
 
ఇరు జట్ల వివరాలు... 
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్. 
 
ఆస్ట్రేలియా : కమినస్, వార్నర్, హెడ్, మార్ష్, స్మిత్, లబుషేర్, మ్యాక్స్‌వెల్, ఇంగ్లిష్, స్టార్క్, జంపా, హేజెల్ వుడ్ 
 
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తుది సమరం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీమిండియాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. 140 కోట్ల మంది భారతీయులు ఉత్సాహంగా మీవెంటే ఉన్నట్లు పేర్కొన్నారు. 'బాగా ఆడండి, క్రీడా స్ఫూర్తిని నిలబెట్టండి' అని ఓ ట్వీట్‌ చేశారు.
 
ఇదిలావుంటే, ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌లు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్న విషయం తెలిసిందే. ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులతో మైదానం కిక్కిరిసిపోయింది. అంతకుముందు టాస్‌ గెలిచిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుని, భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. పటిష్ఠమైన ఆస్ట్రేలియాను చిత్తుచేసి ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచి.. మువ్వన్నెల జెండాను భారత్‌ ఎగరేయాలని అభిమానులంతా ఆకాంక్షిస్తున్నారు.