ఆ వ్యక్తి కోసం ప్రపంచ కప్ గెలవాలనుకుంటున్నాం.. రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టైటిల్ వేట కోసం అంతిమ సమరం జరుగనుంది. భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు పోటీ పడుతున్న ఈ మ్యాచ్ అహ్మదాబాద్ నగరంలోని మొతేరా స్టేడియంలో జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలివున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత జట్టు సాధిస్తున్న విజయాల వెనుక ప్రధానమైన వ్యక్తి కోచ్ రాహుల్ ద్రావిడ్, జట్టులోని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించే ద్రావిడ్ వైఖరి స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి వ్యక్తి కోసం తాము వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నామని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇలాంటి చారిత్రక ఘట్టంలో తాను కూడా ఓ భాగం కావాలని ద్రావిడ్ తప్పకుండా ఆకాంక్షిస్తుంటాడని అభిప్రాయపడ్డాడు.
"ఆటగాళ్లుగా మేం భిన్నమైన వాళ్లం. రాహుల్ భాయ్ ఆడినప్పటి రోజులకు, ఇప్పుడు నేను ఆడుతున్న రోజులకు చాలా తేడా ఉంది. తన అనుభవాలను ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. మీరు ఎలా ఆడాలనుకుంటారో అలాగే ఆడండి అని భుజం తట్టి చెబుతారు'' అని రోహిత్ శర్మ వివరించారు.
భారత క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రావిడ్‌కు ప్రత్యేక అధ్యాయం ఉంది. బ్యాటింగ్‌లో దుర్భేద్యమైన టెక్నిక్‌తో ప్రపంచ ప్రఖ్యాత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. టెస్టుల్లో 13,288... వన్డేల్లో 10,889 పరుగులు నమోదు చేశాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ కర్ణాటక కిశోరం 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. మహోన్నత బ్యాట్స్‌మన్‌గా ఖ్యాతి పొందినప్పటికీ, సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క వరల్డ్ కప్ టైటిల్ కూడా లేకపోవడం ద్రావిడ్ కెరీర్‌కు వెలితిగా ఉండిపోయింది. ఇప్పుడా లోటును పూరించాలని రోహిత్ సేన దృఢ నిశ్చయంతో ఉండటం గమనార్హం.