సర్కస్‌లోని జంతువుల్లా చూశారు.. గబ్బా కోటను ఎలా బద్ధలు కొట్టామంటే...: అశ్విన్
ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్టు చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోయేటువంటి విజయాన్ని ఇటీవల నమోదు చేసింది. అదీకూడా యువకులతో కూడిన కొత్త జట్టు ఆసీస్‌ను చిత్తు చేసి విజయం సాధించింది. గడ్డు పరిస్థితుల మధ్య భారత్ విజేతగా నిలిచింది.
ఈ విజయంపై భారత స్పిన్నర్ అశ్విన్ స్పందించారు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఆసీస్ అభిమానులతో పాటు మీడియా ప్రయత్నించిందని ఆరోపించాడు. బ్రిస్బేన్ టెస్ట్ చారిత్రక విజయానికి సిడ్నీలోనే తొలి అడుగు పడిందన్నాడు.
ఆస్ట్రేలియాలో భారత జట్టును సర్కస్‌లో జంతువుల్లాగా చూశారన్నారు. చివరి రోజు అశ్విన్, విహారి 42 ఓవర్ల పాటు అసాధారణ పోరాటం చేసి.. ఆ మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించినట్టు గుర్తుచేశారు. ఇదే సానుకూల దృక్పథంతో.. టీమిండియా బ్రిస్బేన్‌లో సంచలన విజయం సాధించినట్లు అశ్విన్ చెప్పాడు.
ఇక ఈ టూర్‌కు ఇండియా కంటే ఎక్కువగా ఆస్ట్రేలియానే సిద్ధమైందని, అయితే మొత్తం నాలుగు టెస్టుల్లోనూ ఆ టీమ్ తమ నలుగురు ప్రధాన బౌలర్లనే కొనసాగించి పొరపాటు చేసిందని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ అన్నాడు. తొలి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ అనంతరం రెండు మ్యాచుల్లో గెలిచి సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియాలో సీనియర్లు లేనప్పటికీ, ఆటగాళ్లు గాయాలపాలైనప్పకీ యంగ్ జట్టు ఘన విజయం సాధించడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది.