ఆదివారం, 17 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (17:44 IST)

సత్తా ఉన్న ఆటగాళ్లకు ఎల్లపుడూ మద్దతు ఉంటుంది : రోహిత్ శర్మ

rohit sharma
సత్తా ఉన్న ఆటగాళ్లకు భారత క్రికెట్టు మేనేజ్‌మెంట్ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. కేరీర్‌లోనే అత్యంత చెత్తగా ఆడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. దీనిపై అనేక రకాలైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటిపై రోహిత్ శర్మ స్పందించారు. 
 
"గత రెండు టెస్ట్ మ్యాచ్‌లు ముగిసిన సమయంలోనూ తాను ఇదే అంశంపై మాట్లాడాను. ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి కష్టకాలంలో ఉన్నపుడు వారికి మరింత సమయం ఇవ్వడం జరుగుతుంది. వారు తమను తాము నిరూపించుకోవడానికి అవకాశాలు ఇస్తాం. ఇక వైస్ కెప్టెన్ పదవిలో ఉన్నా, పదవి కోల్పోయినా దానికంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు" అని రోహిత్ శర్మ అన్నారు. 
 
అంతేకాకుండా నెట్స్‌లో రాహుల్, శుభమన్ గిల్‌ ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తుండటంతో వివరణ ఇచ్చారు. చివరి నిమిషం వరకు తుది 11 మందిలో ఏవైనా మార్పులు జరగొచ్చని, ఎవరైనా గాయపడితే వారు బదులు మరొకరు జట్టులోకి వస్తారని రోహిత్ శర్మ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. కాగా, పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, మూడో టెస్ట్ మ్యాచ్ బుధవారం నుంచి ఇండోర్ వేదికగా ప్రారంభంకానుంది.