క్యాష్ కౌంటర్ పక్కనే నీటి ఫౌంటైన్లు ఎందుకుంటాయో తెలుసా?
డబ్బు.. సంపద.. జీవితానికి అత్యంత ముఖ్యమైన అంశాలు. మన ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలంటే.. ధనం ఉంచే ప్రాంతాల్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం మంచి ఫలితాలనిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడూ ధనాన్ని ఉంచే ప్రాంతాల్లో ఎలాంటి చెట్లను పెట్టుకోవాలో, ఎలాంటి రంగులను వాడాలో, ఎలాంటి ఫర్నిచర్‌ను ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఫెంగ్‌షుయ్ సూత్రాల ప్రకారం సంపదకు, చెక్కకు సంబంధం ఉంది. కలప దొరకాలంటే నీరు, భూమి తప్పనిసరి. అందువల్ల ఈ మూడు శక్తులు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. దీని కోసం ధనాన్ని దాచుకొనే ప్రాంతాల సమీపంలో.. మనీప్లాంట్లు, వెదురు మొక్కలు, అలోవెరా వంటి మొక్కలను ఉంచాలి. అలోవెరాను మొక్కలను ఉంచటం వల్ల గాలిలో ఉండే ప్రతికూల శక్తులు శుద్ధి అవుతాయి.
లాఫింగ్ బుద్ధా, చైనీస్ వెల్త్ కాయిన్స్, ఫెంగ్‌షుయ్ ఎక్వేరియం వంటివి ఈ ప్రాంతంలో ఉంచుకోవటం వల్ల ధనానికి సంబంధించిన అంశాల్లో లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో నీరు ఉండాలి. అందుకే చైనాలో చాలా షాపుల్లో క్యాష్ కౌంటర్ పక్కనే నీటితో ఉండే ఫౌంటెన్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉంచే ఫ్రేములు కాని ఫర్నిచర్ చతురస్రాకారాలలో ఉండాలి. దీనివల్ల అదనపు శక్తి ఉత్పత్తి అవుతుంది.
నీటితో పాటు దట్టమైన చెట్లు, అడవులు ఉన్న చిత్రాలను కూడా ఉంచాలి. ఈ ప్రాంతానికి ఆకుపచ్చ లేదా నీలం రంగులు వేస్తే మంచిది. ఎక్కువ ఫెంగ్‌షుయ్ శక్తి అవసరమని భావించేవారు ఎరుపు రంగు కూడా వేయవచ్చు. ఈ ప్రాంతంలో చెడువాసనలు రాకుండా సువాసనను ఇచ్చే పూలను, వాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ను ఉంచాలి.