సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (16:00 IST)

తమిళనాడులో కరోనా ఉధృతి : ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్!!?

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఈ రాష్ట్రంలో ఒకవైపు కోవిడ్ కేసులు, మరోవైపు, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కరోనా వైరస్ కేసుల కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక రకాలైన ఆంక్షలను విధించి అమలు చేస్తుంది. తాజాగా ప్రతి ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ విధించనుంది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. అదేసమయంలో ఈ నెల 6వ తేదీ నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. 
 
కానీ, ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణ్యం మాట్లాడుతూ, ఇకపై ఆదివారాల్లో లాక్డౌన్ అమలవుతుందని, అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆదివారం జరిగే వ్యాక్సినేషన్ క్యాంపులను శనివారాల్లో నిర్వహిస్తామని చెప్పారు. దీంతో ప్రతి ఆదివారాల్లో లాక్డౌన్ విధించడం ఖాయమని తేలిపోయింది. అలాగే, విద్యా శాఖామంత్రి అన్బిల్ మహేష్ కూడా మాట్లాడుతూ, జనవరి 20వ తేదీ పైన జరుగనున్న కాలేజీ పరీక్షలను వాయిదా వేస్తామని మరో సంకేతం ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో లాక్డౌన్ ఖాయమనే తేలిపోయింది. 
 
కాగా, రాష్ట్రంలో ఇప్పటికే సినిమా థియేటర్లు, మెట్రోరైళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాయామశాలల్లో 50 శాతం మందిని మాత్రమే అనుమతించేలా నిబంధనలు తీసుకొచ్చారు. అలాగే, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఆలయాలు, మసీదులు, చర్చిల్లో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. వివాహాది శుభకార్యాలకు కేవలం 100 మంది, అంత్యక్రియలకు 20 మంది చొప్పున పాల్గొనేలా ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలను జారీచేసిన విషయం తెల్సిందే.