1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2023 (09:54 IST)

పెళ్లయిన మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడ?

lovers
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వివాహమైన మాజీ ప్రియుడిని ఓ యువతి తన తల్లిదండ్రుల సాయంతో కిడ్నాప్ చేసి ఓ గుడిలో బలవంతంగా పెళ్లి చేసుకుంది. తన మాజీ ప్రియుడిని మరిచిపోలేనని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా కుమార్తెకు సహకరించి, మాజీ ప్రియుడిన కిడ్నాప్ చేసేందుకు సహకరించారు. అయితే, వివాహితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. 
 
చెన్నై వేళచ్చేరికి చెందిన పార్తీబన్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కాలేజీ చదువుకునే రోజుల్లో వేలూరు జిల్లా రాణిపేటకు చెందిన సౌందర్య అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ ఏడేళ్లపాటు కొనసాగింది. అయితే, వారి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. ఈ క్రమంలో పార్తీబన్ గత నెల 5వ తేదీన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన మాజీ ప్రియురాలు తట్టుకోలేపోయింది. తన మాజీ ప్రియుడిని మర్చిపోలేక పోతున్నానని, అతనితో తన వివాహం జరిపించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేసింది. దీంతో యువతి తల్లి ఉమ, ఆమె బంధువులు రమేష్, శివకుమార్‌ల సాయంతో శుక్రవారం పార్తీబన్‌ను కిడ్నాప్ చేసింది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా, అతన్ని బలవంతంగా అపహరించి కారులో కాంచీపురం తీసుకెళ్లారు. అక్కడ ఓ ఆలయంలో అతనితో సౌందర్య మెడలో తాళి కట్టించారు.
 
అయితే, తన భర్త పార్తీబన్‌ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ కెమెర ఫుటేజీ ఆధారంగా నిందితురాలు గుర్తించిన పోలీసులు యువతితో పాటు ఆమె తల్లి, అపహరణతో ప్రేమేయం ఉన్న ఇతర బంధువులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.