ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (20:51 IST)

నేను ప్రధాన మంత్రినైతే.. ఉద్యోగాలను సృష్టించే విధానాలపై..?: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాన మంత్రినైతే వృద్ధి కేంద్రంగా అమలవుతున్న విధానాల కన్నా ఉద్యోగాలను సృష్టించే విధానాలపై దృష్టిపెడతానని చెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న విధానాలు సరిగా లేవన్నారు.
 
శుక్రవారం ఆయన అమెరికా మాజీ స్టేట్ సెక్రటరీ, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ప్రొఫెసర్ నికొలస్ బర్న్స్‌తో ఆన్‌లైన్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రస్తుత వృద్ధిని పరిశీలిస్తే.. వృద్ధి-ఉద్యోగాల సృష్టి, వృద్ధి-వాల్యూ ఎడిషన్, వృద్ధి-ఉత్పాదకత మధ్య ఉండవలసినంత పరస్పర సంబంధం లేదని రాహుల్ గాందీ చెప్పారు. 
 
వాల్యూ ఎడిషన్ (వస్తువు లేదా సేవ విలువకు, దానిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుకు మధ్య తేడా)ను చైనీయులు బాగా ముందుకు తీసుకెళ్తున్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఉద్యోగాలను సృష్టించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పే చైనా నేత కనీసం ఒకరైనా తనకు కనిపించలేదని చెప్పారు. భారత దేశ వ్యవస్థలను అధికార పక్షం గంపగుత్తగా కబ్జా చేసిందని, ఫలితంగా మొత్తం నమూనాయే మారిపోయిందని ఆరోపించారు.
 
ప్రతిపక్షాలు న్యాయమైన రాజకీయ పోరాటానికి మద్దతిస్తాయని అందరూ భావిస్తారని, అటువంటి ప్రతిపక్షాలు 2014 తర్వాత ఆ పనిని ఎంత మాత్రం చేయలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాత్రమే కాదని, బీఎస్‌పీ, ఎస్‌పీ, ఎన్‌సీపీ కూడా ఏ ఎన్నికల్లోనూ గెలవడం లేదని చెప్పారు. 
 
రాజకీయ పార్టీగా కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు కల్పించే వ్యవస్థలు ఉండాలని చెప్పారు. ప్రస్తుతం భారత దేశంలో ఇవేవీ లేవని స్పష్టం చేశారు. బీజేపీ తీరును చాలా మంది ఇష్టపడటం లేదని, అలాంటివారినందరినీ ఏకతాటిపైకి తేవాలని అన్నారు.