Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?
ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ ఏకాదశి నుంచే పండుగలు ప్రారంభం అవుతాయి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 6వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే ప్రారంభదినంగా భావిస్తారు. చాతుర్మాసం ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది. తద్వారా వచ్చే నాలుగు నెలల పాటు వివాహాలు, గృహప్రవేశం, శుభకార్యాలు చేయకూడదు.
ఈ రోజున విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం.. సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వంటివి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండటం, మాంసాహారం, మద్యపానం వంటి అశుద్ధ చర్యల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే, పగటి పూట నిద్రపోవడం, ఇతరులతో గొడవ పడటం, అపవాదాలు చేయడం వంటి నెగటివ్ పనులు చేయరాదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ దినాన విష్ణువు పూజ కోసం తులసి ఆకులు కావాలంటే వాటిని ముందే సిద్ధం చేసుకోవాలని సూచిస్తారు.
ఈ పవిత్ర రోజున వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి శుభ్రతకూ ప్రాధాన్యత ఇవ్వాలి. జుట్టు కోయడం, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం వంటి చర్యలు ఈ రోజు నిషిద్ధం. ఇలాంటివి చేస్తే దారిద్ర్యం వెంటాడుతుందని, అశుభ ఫలితాలనూ కలిగించవచ్చునని చెబుతారు.