సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2016 (12:18 IST)

తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!

ఆపద మ్రొక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతి పెద్ద బావి ఉంది. స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు.

ఆపద మ్రొక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతి పెద్ద బావి ఉంది.  స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావినే పూలబావి అంటారు. 
 
పూల బావికి మరో పేరుంది. అదే భూతీర్థం. పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమై పోయింది. అనంతరం శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తులు ఒక బావిని తవ్వగా భూ తీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రంగదాసు ఆ బావిలోని నీళ్లను వాడుతూ, శ్రీ వేంకటేశ్వరుని పూజకై సంపెంగ చేమంతుల మ్రొక్కలతో ఒక తోటను పెంచాడు. మళ్లీ ఆ రంగదాసుడే తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వేంకటేశ్వరస్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా తొండమానుడు దానిని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రతి పాత్రుడై ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసున్ని దర్సించుకుని వెళుతూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి.
 
ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరుమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడంట. ఏకాంతసేవ సమయంలో శ్రీనివాసునితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించిన తొండమానుణ్ణి చూసి సిగ్గుతో శ్రీదేవి శ్రీస్వామివారి వక్ష స్థలంలోను, భూదేవి తొండమానుడు కట్టించిన ఈ బావిలోను దాక్కొన్నారట. వరాహ పురాణాంతర్గత వేంకటాచల మహత్మ్యం అంతా ఇంతా కాదు.
 
ఆ తర్వాత భగవద్రామానుజుల వారు తిరుమలకు వేంచేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థంమనెడి బావిని చూసి అందులో భూదేవి, శ్రీదేవి దాగి కొనుట అనెడి పురాణ ప్రవచనాన్ని బట్టి, ఆ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి, తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చన నివేదనాదులు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారని, అంతే కాకుండా ప్రతిరోజు శ్రీ స్వామివారికి అలంకరింపబడి తొలగింపబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేట్లుగా నిర్ణయించారని శ్రీ వేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం తెలుపుతున్నది.
 
అప్పటి నుంచి నిత్యమూ పుష్పాంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి, పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతోంది. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అదీ తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరు పంచమీతీర్థం రోజున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అలంకరించిన పూలమాలలు, పసుపు కుంకమలు, పరిమళ ద్రవ్యాలు, చీర, రవికలు, లడ్డూలు, వడలు తదితర ప్రసాదాలు ఛత్రచామర బాజాభజంత్రీలు వగైరా సకల రాజోపచారాలతో వృష, గజ తురగ భక్త బృందాలతో తిరుమల నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. 
 
అదేరోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తరువాత చక్రస్నానం జరుగుతుంది. ఇలా నేటికీ జరుగుతూ ఉన్న సనాతన సాంప్రదాయం ఇది. ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే సేవల్లోను విశేషంగా పుష్పాలంకరణ జరుగుతతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవటం జరుగుతోంది. 
 
ఈ పూలబావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది. ఆ తరువాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురుబావి వలె పునర్నిరమింపబడింది. ఇటీవల ఈ బావిపై  ఇనుపకడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవి, పరమ భక్తాగ్రేసరుడైన తొండమాను చక్రవర్తిని, భగవద్రామానుజల వారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మాల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటోంది ఈ పూల బావి ఎంతో గొప్పది కదా.!