మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (10:27 IST)

కుబేరుని గర్వం అణిచిన ఏకదంతుడు...

lord ganesh
పురాణాల్లో కుబేరుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కుబేరుడి గర్వాన్ని ఏకదంతుడు అణిచివేశాడు. కుబేరుడు ఎంత ధనవంతుడో.. అంతటి గర్వం కలిగినవాడు. ఆయనకు తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ ప్రదర్శించాలన్న కోరిక కలిగింది. ఇందుకోసం పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేయదలిచాడు. ముందుగా పరమశివుని వద్దకు వెళ్లి తను ఏర్పాటు చేసిన విందుకు రమ్మని ఆహ్వానించాడు. ఈ పిలుపుతోనే పరమశివుడికి కుబేరుని గర్వం, అహంకారం అవగతమైంది. ఎలాగైనా అతనికి గర్వభంగం కలిగించాలని భావించాడు. 
 
అందులోభాగంగా, తనకు బదులు తన కుమారుడు విఘ్నేశ్వరుడు విందుకు వస్తాడని చెప్పి కుబేరుడిని పంపించి వేశాడు. విందు రోజు రానే వచ్చింది. వినాయకుడు కుబేరుని నివాసానికి వెళ్లాడు. కుబేరుడు వినాయకుడిని వెంటపెట్టుకుని తన రాజమందిరం చూపిస్తూ తన ప్రాభవాన్ని ప్రదర్శించసాగాడు. భవనం అంతా కలియతిరుగున్న వినాయకుడికి ఆకలి అనిపించింది. 
 
అదే మాట కుబేరుడికి చెప్పడంతో ఆయన పరిచారికలను పిలిచి గణేశుడికి అతిథిమర్యాదలు చేయమని పురమాయించాడు. పరిచారికలు వినాయకుడికి ఎంత భోజనం వడ్డించినా, ఆయన ఆకలి తీరలేదు. ఆఖరికి అలకాపురిలో ఆహారం అన్నది లేకుండా పోయింది. అయినా ఆకలి తీరని వినాయకుడు కనిపించిన ప్రతి దానిని ఆరగించడం మొదలుపెట్టాడు. దాంతో భయపడిన కుబేరుడు శివుడిని శరణుజొచ్చాడు. 
 
తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. అప్పుడా ముక్కంటి చిరునవ్వుతో గుప్పెడు మెతుకులు కుబేరుని చేతిలో ఉంచి వాటిని ఆరగించమని ఆదేశించాడు. దీంతో వినాయకుడి ఆకలి తీరిపోయింది. అలాగే కుబేరుని గర్వాన్ని పూర్తిగా అణిచివేసిన ఘనత బొజ్జ గణపయ్యకే దక్కుతుంది.