గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 26 ఆగస్టు 2019 (21:52 IST)

మందబుద్దులు, అల్పాయుష్కులు, అంతుబట్టని రోగములతో బాధపడేవారు....

సత్యమును పలుకుట, ధర్మమును ఆచరించుట మానవుని విధి. వాటిని ఆచరించిన వాడే సృష్టి విధానములో నడిచిన వాడగుచున్నాడు. సత్యము శాశ్వతమైనది. అదే పరబ్రహ్మస్వరూపము. ధర్మము కృతయుగమున నాలుగు పాదములతో ప్రారంభమై క్రమముగా ఒక్కొక్క పాదము తగ్గుచు ఈ కలియుగమున ఒక పాదముతోనే ధర్మము నడుచుచున్నది. 
 
అందువలన మానవులు దుర్భర జీవనము గడుపుచుండిరి. ఆయా యుగములలో వలె శిక్షించుటకు రాక్షసులు, దుర్మార్గులు ఇప్పుడు వేరుగాలేరైరి. రాక్షసత్వము, దుర్మార్గత్వము, పశుతత్వము, మానవత్వము, దివ్యత్వము, దైవత్వము ప్రతి మానవునిలో కనిపించుచున్నవి. అన్ని గుణములు మానవుని యందే నిక్షిప్తమైయుండ అజ్ఞానము వలన రజో, తమోగుణములు ప్రకోపించుచు మానవుడు పరులను బాధించుచుండుట చూచుచున్నాము.
 
అయినను అట్టి వారిని శిక్షించుట ప్రారంభించిన మానవులెవరు మిగులరనిపించుచున్నది. అందువలన మానవులు ఎట్టివారైన సంహరించి శిక్షించు కాలము కాదిప్పుడు. వారి మనో వృత్తులను సంస్కరించి సన్మార్గులను చేయుచు మానవత్వము లోనికి తీసుకొని వచ్చి ముందుకు నడుపవలసియున్నది.
 
ఇప్పటి మానవుల స్ధితి అలసత్వులు, మందబుద్దులు, అల్పాయుష్కులు, అంతుబట్టని రోగములతో బాధపడేవారు, మంచి పనులు చేయలేని వారగుటతో వారినుద్దరించుటకు నిరంతరము భగవంతుడి చింతన, సద్గురు పాదములు ఆశ్రయించుటయే మార్గము. 
 
దేవీ దేవతులు, వేదములు- ఉపనిషత్తుల పని మానవులను ఉద్దరించుటయే కదా..భారత, భాగవత, రామాయణము ఆదిగా గల గ్రంధముల పఠనము, ప్రవచనములు వినుట ఇహపరముల సుఖించునట్లు నడుచుటకే కదా... పుణ్యక్షేత్రములు దర్శించిన, నదీనదములలో మునిగిన మానవ జీవితమును సుఖవంతము చేసుకొనుటకే కదా...పీఠాధిపతుల, అవధూతల, మహాత్ముల వ్యవస్ధ మానవులను ఉద్దరించి ముక్తి మార్గము నకు చేర్చుటకే కదా.
 
ఇదంతా పరిశీలించిన అన్నిటికి మానవునినే సూత్రధారిగా సృష్టిలో చేయబడినది. ఇన్ని విధముల మానవులనుధ్దరించు వ్యవస్ధలు ఉన్నప్పటికి అజ్ఞానమును దాటి జ్ఞాన మార్గమున పయనించు వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పెద్దల ప్రవచనములు, సత్సంగముల ఫలితములు తగు మార్గమున ఇంకను మానవులకందవలసియున్నది.
 
సరియైన సద్గురువును ఆశ్రయించువారు తప్పక ఫలితమును పొందగలరు. సద్గురు ఆశ్రయము లభింపచేయమని భగవంతుని ప్రార్ధింతుము గాక.. ఇంకను ముందుకు వెళ్లుచూ జీవాత్మల స్ధితిగతులను తెలుసుకొనవలయును.