ప్రేమ వివాహం... ఆ కోరికలు తీరిపోతే ప్రేమ కూడా కరిగిపోతుందా...?
చాలా మంది యువకులు తమకు నచ్చిన యువతిని గాఢంగా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటారు. ప్రేమించిన యువతిని దక్కించుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు. తాను ఇష్టపడిన యువతితో ప్రేమ సాగించే సమయం.. క్షణాలను ఎంతో ఆనందంగా భావిస్తుంటారు. ఆమెనే నా భార్యగా స్వీకరించాలని నిర్ణయించుకున్నా. అనుకున్నదే తడవుగా సతీమణిని చేసుకున్న తర్వాత వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎంత పటిష్టమైందో తేలిపోతుంది. అసలు అలా ఎందుకు జరిగింది.. జరిగేందుకు కారణాలేంటి అనే ప్రశ్నలు ఎదుటివారి నుంచి వస్తాయి. సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి.
నిజానికి అలా అనుకుంటే ప్రేమ శారీరకమైన ఆకర్షణకేనా...? ఆ కోరికలు తీరిపోతే, కోరికలతోపాటు ప్రేమ కూడా కరిగిపోతుందా...? స్త్రీ, పురుషుల నడుమ శారీరక ఆకర్షణ ఏర్పడటం ప్రకృతి సహజం. ఇందుకు కారణం రెండు వేర్వేరు రూపాలుండటం, వాటి మధ్య భిన్నధృవాలు వంటి అయస్కాంతపు ఆకర్షణ ఉండటం. పెళ్లికి ముందు ప్రేయసీప్రియులు కలుసుకున్నప్పడు.. ఒకరినొకరు పొగుడుకుంటూ.. తమలోని లోపాలను ఎత్తి చూపుతూ సరిచేసుకుంటూ ముందుకు పోతారు.
కానీ, వివాహమై ఒకే ఇంటిలో కలిసి బతికేటపుడు మాత్రం.. ఈ ప్రేమానురాగాలు వారిలో కనిపించవు. చిన్నచిన్న విషయాల్లో చిన్నపిల్లలు తరహాలో గొడవలు పడుతుంటారు. ఇలాంటి చిన్నచిన్న విషయాలు వారు వైవాహిక జీవితంపై ప్రభావం చూపడమే కాకుండా శృంగార జీవనంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లోకమంతా నశించిపోయినా తరిగిపోనిది ప్రేమ అని చెప్పుకున్నవాళ్లు కూడా, కొంతకాలం తర్వాత ప్రేమను కోల్పోయి బతుకు వెళ్లదీస్తున్నారు.
అది ప్రేమ తప్పు కాదు. ప్రేమ అన్నది పెళ్లికి మొదటి మెట్టుగా భావించడం తప్పుడు లెక్క. ఒక స్త్రీ ప్రియురాలిగా ఉన్నప్పుడు ఆమెను ఎలా చూసుకున్నామో, అలాగే భార్యగా ఉన్నప్పుడు కూడా అలాగే చూసుకోవాలని మర్చిపోతున్నారు. ఇదే ప్రేమ తరిగిపోయిందనడానికి అసలు కారణంగా తెలుస్తోంది.