శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (12:28 IST)

ఎమ్మెల్యే పదవికి త్వరలో ఈటల రాజీనామా!

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆయనతోపాటు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడి కూడా కమలం గూటికి చేరనున్నారు. వారు ఎప్పుడు కాషాయ కండువా కప్పుకొంటారన్నదానిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

ఈ నిర్ణయాధికారాన్ని వారు బీజేపీ నాయకత్వానికే ఇచ్చారు. అయితే త్వరలో ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పార్టీలో చేరాలని, అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వారికి నడ్డా భరోసా ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఈటల రాజేందర్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి.. ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు.

సుమారు అరగంటపాటు చర్చలు జరిపారు. తొలుత సంజయ్‌, తరుణ్‌ ఛుగ్‌తో నడ్డా చర్చించారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. ఉద్యమకారులను సీఎం కేసీఆర్‌ ఇబ్బంది పెడుతున్న తీరును నడ్డాకు సంజయ్‌ వివరించారు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని, ప్రస్తుత మంత్రివర్గంలో కూడా ఉద్యమకారులెవరూ లేరని తెలిపారు.

టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయ వేదికగా బీజేపీనే ఉద్యమకారులు భావిస్తున్నారని, వారంతా కమలం గూటికి చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. అనంతరం ఈటలను, రవీందర్‌రెడ్డిని లోనికి పిలిపించారు. 
 
కేసీఆర్‌ వేధిస్తున్నారు: ఈటల
నడ్డాతో భేటీ సందర్భంగా ఈటల రాజేందర్‌ పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకటేనని సీఎం కేసీఆర్‌ ప్రచారం చేయిస్తూ.. ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిస్తే తమ పరిస్థితేంటని ప్రశ్నించారు.

దీంతోపాటు కేసీఆర్‌ తనను వేధిస్తున్న విషయాన్ని కూడా నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నడ్డా స్పందిస్తూ..  తెలంగాణలో దుర్మార్గాలు పెరిగిపోతున్నాయని, టీఆర్‌ఎ్‌సతో కలిసే ప్రసక్తే లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పోరాడుతున్న తరహాలోనే టీఆర్‌ఎ్‌సపైనా పోరాటం ఉంటుందని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అవినీతిమయంగా మారిందని, వారిపై ఏ సమయంలో విచారణ జరిపించాలో తమకు తెలుసునని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, దీనిపై పార్టీ కార్యకర్తలకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. తనకు, తనతోపాటు పార్టీలోకి వచ్చేవారికి సముచిత గౌరవం ఇవ్వాలని ఈటల కోరగా.. తగిన ప్రాధాన్యం ఇస్తామని నడ్డా అన్నారు.

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా తాను పనిచేస్తానని ఈటల చెప్పారు. కాగా, తనకు టికెట్‌ ఇచ్చినా ఓడించింది కూడా టీఆర్‌ఎస్‌ నాయకత్వమేనని ఏనుగు రవీందర్‌రెడ్డి తెలిపారు.

తనకు వ్యతిరేకంగా నిలబడి, గెలిచిన అభ్యర్థిని తీసుకెళ్లి టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారని, కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరినవారిపై పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులను కేసీఆర్‌ కావాలనే ఓడించారని అన్నారు. బీజేపీ నేతలు తప్ప.. ఎవరు గెలిచినా టీఆర్‌ఎ్‌సలోనే చేరుతారన్న ప్రచారం ఉందని, అందుకే, బీజేపీ పట్ల విశ్వాసం పెరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా సంజయ్‌ జోక్యం చేసుకుని.. సీఎం కేసీఆర్‌ మొత్తం డబ్బుల రాజకీయం చేస్తున్నారని నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. అడ్డదారిలో గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని, ఇతర పార్టీల నుంచి ఎవరు గెలిచినా.. వారిని ప్రలోభపెట్టి టీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటున్నారని వివరించినట్లు సమాచారం.