శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 మే 2021 (11:46 IST)

జూన్‌ ఒకటో తేదీ నుంచే ఆన్‌లైన్ తరగతులు..

కోవిడ్ విజృంభించడంతో ప్రస్తుతం విద్యా సంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మళ్లీ పాఠశాలలను తెరిచేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇదే క్రమంలో 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచే ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 
 
ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మంగళవారం ప్రకటన విడుదలచేశారు. మొదటి విడత ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు మంగళవారం నుంచే ప్రారంభించినట్టు వెల్లడించారు. అయితే కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ జూలై 5వ తేదీతో ముగుస్తుంది. ఇది మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్‌ మాత్రమేనని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల ఇంటర్నెట్‌ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఇప్పటికే అయా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
 
ప్రతి విద్యా సంవత్సం జూన్‌ మాసంలో మొదలవుతుంది. ఏటా జూన్ మొదటి వారం నుంచే ఇంటర్‌ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్‌ 1 నుంచే ఆన్‌లైన్‌ క్లాసులతోపాటు, మంగళవారం నుంచే ప్రవేశాలు మొదలు కానున్నాయి. సెకండియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి ప్రారంభిస్తామని జలీల్‌ వెల్లడించారు.